ఎదురే లేదు | As it happened: India vs Sri Lanka, Asia Cup, Match 7 | Sakshi
Sakshi News home page

ఎదురే లేదు

Published Tue, Mar 1 2016 11:51 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

ఎదురే లేదు - Sakshi

ఎదురే లేదు

ప్రపంచకప్‌కు సన్నాహకం అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ మ్యాచ్‌కూ పదునెక్కుతున్న భారత జట్టు తమ అద్భుత ప్రదర్శనతో మరో ‘ఆసియా’ జట్టును పడగొట్టింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఇప్పటికే చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు శ్రీలంకను కూడా కుప్పకూల్చింది. ప్రత్యర్థి మారినా, పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆధిపత్యంలో మాత్రం తేడా రాలేదు.
 ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్... ప్రత్యర్థి జట్టులో ఒక్క బ్యాట్స్‌మన్‌కు కూడా దూకుడుగా ఆడే అవకాశం ఇవ్వకుండా మన బౌలర్లు చెలరేగడం...

ఆపై ఎప్పటిలాగే కోహ్లి బాధ్యతాయుత బ్యాటింగ్... చాలాకాలం తర్వాత యువరాజ్ బ్యాట్‌నుంచి జాలువారిన భారీ సిక్సర్లు... వెరసి మన జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ధోనిసేన ఫైనల్లోకి అడుగు పెట్టేసింది.

 
ఆసియా కప్ ఫైనల్లో భారత్
వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం
5 వికెట్లతో శ్రీలంక చిత్తు
రేపు యూఏఈతో ధోనిసేన చివరి మ్యాచ్


మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కపుగెదెర (32 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పాండ్యా, అశ్విన్, బుమ్రా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

విరాట్ కోహ్లి (47 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) మరో సారి అర్ధ సెంచరీతో సత్తా చాటగా, యువరాజ్ సింగ్ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి, యువరాజ్ నాలుగో వికెట్‌కు 34 బంతుల్లోనే వేగంగా 51 పరుగులు జత చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశారు.  వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గిన ధోని సేన ఫైనల్‌కు అర్హత సాధించింది. తాజా ఫలితంతో లంక ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. గురువారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ జట్టు యూఏఈతో తలపడుతుంది.ఆదుకున్న కపుగెదెర
ఆసియా కప్‌లో ఆరంభంలో పేస్ బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న నెహ్రా, బుమ్రా శ్రీలంకను పూర్తిగా కట్టి పడేశారు. ఒక వైపు పరుగులు తీయలేక, మరో వైపు వికెట్లు చేజార్చుకొని లంక ఇబ్బందులు ఎదుర్కొంది. మూడో ఓవర్లో చండీమల్ (4)ను నెహ్రా అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే జయసూర్య (3)ను బుమ్రా వెనక్కి పంపించాడు. పవర్‌ప్లేలో ఆ జట్టు 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ వెంటనే పాండ్యా వేసిన తొలి బంతికి దిల్షాన్ (18) పెవిలియన్ చేరాడు.

గత మ్యాచ్‌లో తన చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా, ఈ సారి మొదటి బంతికే వికెట్ తీయడం విశేషం. అయితే మ్యాచ్‌లు వేర్వేరు కావడంతో దీనిని హ్యాట్రిక్‌గా పరిగణించరు. ఈ దశలో పాండ్యా వేసిన మరో ఓవర్లో రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించబోయిన మ్యాథ్యూస్ (18) చివరి బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో లంక మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో కపుగెదెర, సిరివర్దన (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.

వీరిద్దరు ఐదో వికెట్‌కు 31 బంతుల్లో 43 పరుగులు జోడించడంతో లంక స్కోరు 100 పరుగులు దాటింది. అయితే సిరివర్దనను అవుట్ చేసి అశ్విన్ దెబ్బ తీశాడు. అదే ఓవర్ చివరి బంతికి రోహిత్ చక్కటి ఫీల్డింగ్ కారణంగా షనక (1) రనౌట్ కాగా... నిలకడగా ఆడుతున్న కపుగెదెర, బౌండరీ వద్ద పాండ్యా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. చివర్లో తిసార పెరీరా (6 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని భారీ షాట్లు ఆడటంతో లంక మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో లంక అత్యధికంగా 13 పరుగులు చేసింది.
 
యువరాజ్ జోరు
లక్ష్యఛేదనలో భారత్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. కులశేఖర తొలి ఓవర్లో ధావన్ (1) అవుట్ కాగా, అతని తర్వాతి ఓవర్లో రోహిత్ (14 బంతుల్లో 15; 3 ఫోర్లు) వెనుదిరిగాడు. అయితే మరోసారి కోహ్లి తన క్లాస్ ఆటతీరును ప్రదర్శించాడు. రైనా (26 బంతుల్లో 25; 2 ఫోర్లు) సహకారంతో మరోక సారి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 47 బంతుల్లో 54 పరుగులు జోడించారు.

రైనా అవుటైన తర్వాత బరిలోకి దిగిన యువరాజ్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో చెలరేగాడు. రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో ఇదే ప్రత్యర్థితో అవమానకర ఇన్నింగ్స్ ఆడిన యువీ ఇప్పుడు తన అసలు ఆట ప్రదర్శించాడు. హెరాత్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, ఆ తర్వాత పెరీరా ఓవర్లోనూ మరో భారీ సిక్సర్ కొట్టాడు. యువీ ధాటికి భారత్ వేగంగా విజయం దిశగా పయనించింది. చివరి వరకు నిలిచిన కోహ్లి అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు.
 
స్కోరు వివరాలు:
శ్రీలంక ఇన్నింగ్స్: చండీమల్ (సి) ధోని (బి) నెహ్రా 4; దిల్షాన్ (సి) అశ్విన్ (బి) పాండ్యా 18; జయసూర్య (సి) ధోని (బి) బుమ్రా 3; కపుగెదెర (సి) పాండ్యా (బి) బుమ్రా 30; మ్యాథ్యూస్ (బి) పాండ్యా 18; సిరివర్దన (సి) రైనా (బి) అశ్విన్ 22; షనక (రనౌట్) 1; పెరీరా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 17; కులశేఖర (రనౌట్) 13; చమీరా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 138.
 వికెట్ల పతనం: 1-6; 2-15; 3-31; 4-57; 5-100; 6-104; 7-105; 8-125; 9-138.
 బౌలింగ్: నెహ్రా 4-0-23-1; బుమ్రా 4-0-27-2; పాండ్యా 4-0-26-2; యువరాజ్ 1-0-3-0; జడేజా 2-0-19-0; అశ్విన్ 4-0-26-2; రైనా 1-0-9-0.
 
భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) చండీమల్ (బి) కులశేఖర 1; రోహిత్ (సి) కపుగెదెర (బి) కులశేఖర 15; కోహ్లి (నాటౌట్) 56; రైనా (సి) కులశేఖర (బి) షనక 25; యువరాజ్ (సి) కులశేఖర (బి) పెరీరా 35; పాండ్యా (బి) హెరాత్ 2; ధోని (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-11; 2-16; 3-70; 4-121; 5-125.
బౌలింగ్: మ్యాథ్యూస్ 3-0-16-0; కులశేఖర 3-0-21-2; పెరీరా 4-0-32-1; చమీరా 4-0-27-0; హెరాత్ 3.2-0-26-1; షనక 1-0-7-1;  సిరివర్దన 1-0-13-0.
 
ఆసియాకప్‌లో నేడు బంగ్లాదేశ్ X పాకిస్తాన్ రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
13 టి20ల్లో కోహ్లి అర్ధసెంచరీల సంఖ్య. మెకల్లమ్, గేల్‌ల అత్యధిక అర్ధసెంచరీల రికార్డును కోహ్లి సమం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement