
హైదరాబాద్‌కు మూడో స్థానం
బెంగళూరు: ఐపీఎల్ తరహాలో దేశంలో జరిగే లూయిస్ ఫిలిప్ కప్ గోల్ఫ్ లీగ్‌లో బరిలోకి దిగిన తొలి సీజన్‌లోనే ఎన్‌స్పోర్ట్స్ హైదరాబాద్ జట్టు ఆకట్టుకుంది. కేజీఏ గోల్ఫ్ కోర్స్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచింది. టేక్ చెన్నై జట్టు విజేతగా నిలువగా... కపిల్‌దేవ్‌కు చెందిన దేవ్ చండీగఢ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
చౌరాసియా, చిక్కరంగప్ప అమోఘంగా రాణించడంతో టైటిల్ గెలిచిన చెన్నై జట్టుకు రూ.36 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. ఎన్‌స్పోర్ట్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ప్రకాశ్ చౌహాన్, గగన్‌జీత్ భుల్లర్ ఆకట్టుకున్నారు. మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగిన ఈ లీగ్‌లో ఆడిన తొలి సీజన్‌లో సంతృప్తికర ఫలితాన్ని సాధించామని హైదరాబాద్ జట్టు యజమాని ఎన్.శ్రీధర్‌రెడ్డి అన్నారు.