
వాండరర్స్ మైదానంలో సిబ్బంది
జొహన్నెస్‌బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు నాలుగో రోజు ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వర్షం పడిన నేపథ్యంలో ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభించినట్లు అంపైర్లు తెలిపారు. మరోవైపు పిచ్ ప్రమాదకరంగా మారడమూ ఆటకు అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ దాదాపు రెండున్నర గంటల ప్రాంతంలో మొదలైంది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పిచ్ గురించి అంపైర్లతో చర్చించాడు. అంపైర్లు శనివారం రెండోసారి పిచ్‌ను పరిశీలించాక మ్యాచ్ కొనసాగించారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి సఫారీలు వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది. ఎల్గర్(11), హషీం ఆమ్లా(2) నాటౌట్ నిలిచారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా మరో 224 పరుగుల వెనుకంజలో ఉంది.