‘ఆఖరి’ అవకాశం | india vs england third test | Sakshi
Sakshi News home page

‘ఆఖరి’ అవకాశం

Published Sat, Aug 18 2018 4:34 AM | Last Updated on Sat, Aug 18 2018 4:34 AM

india vs england third test - Sakshi

ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు మెరుగైన ప్రదర్శనే కనబర్చినా, తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్‌ కోల్పోయింది. అయితే జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు టీమిండియాకు కావాల్సింది సరిగ్గా అదే స్ఫూర్తి! ఇంగ్లండ్‌ గడ్డపై ఎన్నో అంచనాలతో, సిరీస్‌ గెలుపుపై ఆశతో భారత్‌ అడుగు పెట్టింది. కానీ ఒక్కసారిగా అంతా ప్రతికూలంగా మారిపోయి రెండు టెస్టులు చేజారాయి. నాలుగేళ్ల క్రితంనాటి పరాభవం పునరావృతం కాకుండా ఉండాలంటే మూడో టెస్టులో మన జట్టు రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో మెరుగ్గానే కనిపిస్తున్నా... ఆత్మవిశ్వాసం లోపించిన బ్యాటింగ్‌తో కోహ్లి సేన ఎంతగా రాణిస్తుందనేది ఆసక్తికరం.

నాటింగ్‌హామ్‌: టెస్టు సిరీస్‌ గెలిచే ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ కోసం టీమిండియా సన్నద్ధమైంది. నేటి నుంచి ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో జరిగే మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. ఇప్పటికే 0–2తో వెనుకబడి ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా సిరీస్‌ గెలిచే అవకాశం మాత్రం కోల్పోతుంది. మరోవైపు వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న ఇంగ్లండ్‌ మరో గెలుపుపై దృష్టి పెట్టింది. తర్వాతి టెస్టులతో ప్రమేయం లేకుండా ఇక్కడే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.  ఇంగ్లండ్‌ అనూహ్య మార్పుతో తుది జట్టును ప్రకటించింది. న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంతో జట్టుతో చేరిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌ ఆడనున్నాడు.

మళ్లీ మార్పులతోనే...
కోహ్లి ఇప్పటి వరకు 37 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించగా వరుసగా ఏ రెండు టెస్టుల్లోనూ అదే తుది జట్టును కొనసాగించలేదు. ఇప్పుడు 38వ టెస్టులో కూడా అదే జరగనుంది. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడటం ఖాయమైంది. గత మ్యాచ్‌లో కుల్దీప్‌ను ఆడించడాన్ని పొరపాటుగా అంగీకరించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరో ఆలోచనకు తావు లేకుండా అతని స్థానంలో బుమ్రాను తీసుకోనుంది. ముగ్గురు ఓపెనర్లలో ఏ ఇద్దరినైనా కొనసాగించక తప్పదు. కోహ్లి వెన్నునొప్పి నుంచి కోలుకొని బరిలోకి దిగుతుండటం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. భారత్‌ అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటుందా చూడాలి. అలా అయితే హార్దిక్‌ పాండ్యా స్థానంలో కరుణ్‌ నాయర్‌కు అవకాశం దక్కవచ్చు. మరో మార్పు కూడా దాదాపు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ అరంగేట్రం చేయనున్నాడు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement