దక్షిణాఫ్రికా క్రికెటర్లు (ఫైల్ ఫొటో)
కేప్‌టౌన్: వరుసగా రెండు వన్డేలు నెగ్గిన టీమిండియా మూడో వన్డేలోనూ సత్తాచాటి దక్షిణాఫ్రికా గడ్డమీద ఆ జట్టుపై తొలి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గత రెండు వన్డేల్లోనూ భారత్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ రాణించడం మనకు కలిసొచ్చే అంశం. కాగా, డివిలియర్స్, డు ప్లెసిస్, క్వింటన్ డికాక్ లాంటి స్టార్ క్రికెటర్లు దూరం కావడంతో దక్షిణాఫ్రికా ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. అయితే సిరీస్‌పై తమ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని సఫరీ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ అంటున్నాడు. ప్రత్యర్థి తప్పిదాలు చేస్తే ఈ వన్డేలో తమదే విజయమని, కీలక ఆటగాళ్లు లేకున్నా పోరాటం మాత్రం కొనసాగిస్తామని చెప్పాడు.
మూడో వన్డేకు నేపథ్యంలో రబడ మీడియాతో మాట్లాడాడు. 'టీమిండియా ఆటగాళ్ల విషయంలో ఒక్కో బ్యాట్స్‌మెన్ కు ఓ బలహీనత ఉంటుంది. వారి వీక్‌నెస్ పై దెబ్బకొట్టి ప్రయోజనం పొందుతాం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విషయానికొస్తే షార్ట్ పిచ్ బంతులు మా ప్లాన్. భారత్ మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లపై నమ్మకం ఉంచింది. మా జట్టు సైతం ఐదుగురు మణికట్టు స్పిన్నర్లతో మూడో వన్డేకు ముందు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించింది. ఏది ఏమైనా భారత్ బలమైన జట్టు. ఇటీవల ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ నెగ్గారు. కీలక ఆటగాళ్లు డివిలియర్స్, డు ప్లెసిస్, డికాక్ లు గాయాలతో దూరం కావడం మాకు మైనస్ పాయింట్. మా స్పిన్నర్లు ప్రభావం చూపిస్తే మూడో వన్డే నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంటామని' సఫారీ ఫాస్ట్ బౌలర్ రబడ వివరించాడు. కేప్‌టౌన్‌లో నేడు దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment