
పులితో హామిల్టన్ టైమ్ పాస్!
ఎప్పుడూ రేసుల్లో దూసుకుపోయే మెర్సిడెస్ జట్టు డ్రైవర్, విశ్వ విజేత లూయిస్ హామిల్టన్కు ఎందుకో పులితో ఆడుకోవాలని సరదా పుట్టింది.
మెక్సికో:సాధారణంగా పులితో సరదా అంటే రిస్కే. అయితే ఎప్పుడూ రేసుల్లో దూసుకుపోయే మెర్సిడెస్ జట్టు డ్రైవర్, విశ్వ విజేత లూయిస్ హామిల్టన్కు పులులతో ఆడుకోవడం సరదా. ఇటీవల మెక్సికో ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన తరువాత హామిల్టన్ ఆ సరదాను మరోసారి తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా స్థానికంగా పులి ఎన్ క్లోజర్లోకి వెళ్లిన హామిల్టన్ ఆ ముచ్చటను తీర్చుకున్నాడు.
ఒకానొక సందర్భంలో హామిల్టన్ పైకి పులి ఒక్కసారిగా దూకడంతో అతగాడు కంగారుపడ్డాడు. ఆ పులిని తాకిన మరుక్షణమే అది ఆమాంతం తన రెండు కాళ్లను ముందుకు లేపి హామిల్టన్పై వేసింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపోటుకు గురైన హామిల్టన్ దాన్ని సుతిమెత్తగా సముదాయించే యత్నం చేశాడు. ఆ పులిని నెమ్మదిగా నెమరడంతో అది కాస్త కూల్ అయ్యింది. ఈ తాజా వీడియోను హామిల్టన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే అది శిక్షణ ఇచ్చిన పులి కావడంతో హామిల్టన్ సరదాగా టైమ్ పాస్ చేసి బయటకి వచ్చాడు.