డునెడిన్: వెస్టిండీస్‌తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (122 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), టేలర్ (157 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 367 పరుగులు చేసింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 182 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఫుల్టన్ (61), రూథర్‌ఫోర్డ్ (62) అర్ధసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే వరుస విరామాల్లో రూథర్‌ఫోర్డ్, రెడ్‌మండ్ (20) అవుట్ కావడంతో కివీస్ 117 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఫుల్టన్‌కు జత కలిసిన టేలర్ నెమ్మదిగా ఆడాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న ఫుల్టన్‌ను... స్యామీ పెవిలియన్‌కు పంపించాడు. టేలర్ నిలకడకు ప్రాధాన్యమిచ్చినా... తర్వాత వచ్చిన మెకల్లమ్ మాత్రం వేగంగా ఆడాడు. గాబ్రియెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో జట్టు స్కోరును 300 దాటించిన మెకల్లమ్ ఆ తర్వాతా దూకుడును కొనసాగించి కెరీర్‌లో ఏడో టెస్టు సెంచరీని నమోదు చేశాడు.
దుమ్మురేపిన టేలర్, మెకల్లమ్
Published Wed, Dec 4 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement