ఎక్కువసేపు హత్తుకోవాలంటే కార్ పార్కింగ్‌ను వాడుకోండి
ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు ప్రాంతం వినియోగంపై ప్రయాణికులు,
బంధువులకు కొత్త నిబంధనావళి
న్యూజిలాండ్‌లో డ్యునెడిన్ విమానాశ్రయంలో అమల్లోకి కొత్త రూల్స్
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.
‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు.
‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.
డ్రాప్ జోన్‌ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్‌పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు.
‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment