అతను ఎప్పుడూ మౌనముద్రలోనే..: మెకల్లమ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్పై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గతంలో న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలు మోసిన టేలర్ ఎప్పుడూ పెదవి విప్పేవాడే కాదంటూ మెకల్లమ్ రాసిన 'డిక్లేర్' అనే బుక్లో ప్రస్తావించాడు. కనీసం జట్టు సమావేశాల్లో కూడా రాస్ టేలర్ మౌన ముద్రలోనే ఉండేవాడంటూ ఆ పుస్తకంలో ప్రస్తావించాడు.
' మా ప్రధాన కోచ్ మైక్ హెస్సెన్ ఎప్పుడూ ఆటగాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకునేవాడు. అయితే ఇందుకు కారణంగా కెప్టెన్ గా రాస్ టేలర్ ఎప్పుడూ జట్టు ప్రణాళికలు చెప్పకపోవడమే. భవిష్యత్తు ప్రణాళికలేమిటో మేమే చెప్పేవాళ్లం. రాస్ ను ఎప్పుడు అడిగినా ఏమీ లేదు అనేవాడు. ఒక్క పదం కూడా మాట్లాడేవాడు కాదు. దాంతో మా కోచ్ అయోమయంలో పడేవాడు. ఇలా రాస్ ఎందుకు చేసేవాడు నాకైతే తెలీదు. జట్టును ఎప్పుడూ సరైన రీతిలో పెట్టలేకపోయేవాడు. అతని ఆలోచల్ని కూడా జట్టు సభ్యులతో పంచుకునేవాడు కాదు' అని మెకల్లమ్ తాజా పుస్తకంలో వెల్లడించాడు. అయితే రాస్ టేలర్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని తెలిపాడు. రాస్ టేలర్ తరువాత డేనియల్ వెటోరికీ న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పడాన్ని మాత్రం మెకల్లమ్ పరోక్షంగా విమర్శించాడు.