
టైటాన్స్‌కు మళ్లీ నిరాశ
తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లో మళ్లీ నిరాశపరిచింది. సొంత ప్రేక్షకుల మధ్య వరుసగా మూడోసారీ ఓడింది.
సొంతగడ్డపై వరుసగా మూడో ఓటమి
హైదరాబాద్: తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లో మళ్లీ నిరాశపరిచింది. సొంత ప్రేక్షకుల మధ్య వరుసగా మూడోసారీ ఓడింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సేన 18–31 స్కోరు తేడాతో కొత్త జట్టు యూపీ యోధ చేతిలో కంగుతింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. దీంతో 11–12తో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో పేలవమైన ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ జరిగే కొద్దీ ప్రత్యర్థి జోరు పెరిగింది. టైటాన్స్ మాత్రం చేష్టలుడిగింది.
తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి 7 పాయింట్లతో రాణించగా, వికాస్, విశాల్ చెరో 3, రాకేశ్ 2 పాయింట్లు చేశారు. యూపీ ఆటగాళ్లు సమష్టిగా కదంతొక్కారు. నితిన్ తోమర్ (6) సహా... రిషాంక్ దెవాడిగా, నితీశ్ కుమార్ చెరో 5 పాయింట్లు సాధించారు. మహేశ్ గౌడ్ (4), సురీందర్ సింగ్ (3), రాజేశ్ నర్వాల్ (2), జీవ కుమార్ (2) రాణించారు. మరో మ్యాచ్‌లో కొత్త జట్టు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ 26–20తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్ (రాత్రి గం. 8.00 నుంచి); బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి గం. 9.00 నుంచి) తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.