
టోక్యో: వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ 2021 వేసవి సీజన్‌లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. రాబోయే విశ్వక్రీడల షెడ్యూల్... 2020 గేమ్స్ కోసం చేసిన షెడ్యూల్ కన్నా భిన్నంగా ఏమీ ఉండబోదు అని మోరీ పేర్కొన్నారు. ‘అందరూ ఒలింపిక్స్ వేసవి (జూన్–ఆగçస్టు)లోనే జరగాలని కోరుకుంటారు. అందుకే మేం కూడా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యే విశ్వక్రీడల షెడ్యూల్ రూపొందించాలని ఆలోచిస్తున్నాం’ అని మోరీ పేర్కొన్నట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ ‘క్యోడో’ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 మధ్య జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ మంగళవారం గేమ్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే... ఈ క్రీడల్ని వచ్చే ఏడాది మార్చి–మేలో నిర్వహించే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నాడు. అయితే ఈ వారంలో భేటీ కానున్న ‘ఒలిం పిక్స్ కార్యనిర్వాహక కమిటీ’ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో క్రీడల నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తుందని మోరీ స్పష్టం చేశారు. ఐఓసీ, స్థానిక నిర్వాహకులు, వందలాది స్పాన్సర్లు, క్రీడా సమాఖ్యలు, బ్రాడ్‌కాస్టర్లు అందరితో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విశ్వ క్రీడల నిర్వహణ ఖర్చు గతంతో పోలిస్తే విపరీతంగా పెరుగుతుందని కమిటీ సీఈవో తోషిరో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment