మాస్టర్‌తో టాలీవుడ్ ‘బ్లాస్టర్స్’
► సచిన్‌తో జత కట్టిన చిరంజీవి, నాగార్జున
► ఐఎస్‌ఎల్ జట్టు కేరళ బ్లాస్టర్స్‌లో భాగస్వామ్యం
► నిమ్మగడ్డ ప్రసాద్, అరవింద్ కూడా
తిరువనంతపురం: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కొత్త కలయిక...క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో రాబోయే సీజన్‌లో బ్లాస్టింగ్‌కు కేరళ జట్టు సన్నద్ధమైంది. ఈ ముగ్గురితో పాటు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఐఎస్‌ఎల్ టీమ్ కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీలో భాగస్వాములయ్యారు. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అధికారికంగా నలుగురు కొత్త భాగస్వాములు ‘బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలో వాటాలు కొన్నారు. సచిన్‌కు ఇప్పటికే ఈ టీమ్‌లో వాటా ఉంది. ‘మా మూడో సీజన్‌ను ఆశావహ దృక్పథంతో ప్రారంభిస్తున్నాం. కొందరు ప్రముఖులు జట్టు సహయజమానులుగా చేరడం సంతోషకరం.
గత ఏడాది జట్టు వైఫల్యంతో చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. కానీ ఒక ఆటగాడిగా గెలుపు, ఓటములను ఎలా స్వీకరించాలో నాకు బాగా తెలుసు. రెండేళ్లుగా అభిమానులు మాకు అండగా నిలిచారు. ఈ సారి కొత్త వ్యూహాలు రూపొందిస్తాం. టైటిల్ గెలుచుకోవటమే మా లక్ష్యం’ అని సచిన్ వ్యాఖ్యానించారు. తాను కొన్ని సినిమాల్లో ఫుట్‌బాల్ ఆటగాడిగా నటించిన విషయాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకోగా... చాలా రోజులుగా తాను వేర్వేరు ఆటలతో వ్యాపారపరంగా అనుబంధం కొనసాగిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. అంతకు ముందు బ్లాస్టర్స్ యాజమాన్యం కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
చేతులు మారుతూ...
ఐఎస్‌ఎల్ తొలి సీజన్ 2014లో కేరళ బ్లాస్టర్స్ రన్నరప్‌గా నిలిచింది. అయితే గత ఏడాది 14 లీగ్ మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంతో ఆఖరున ముగించింది. తొలి ఏడాది పీవీపీ (60 శాతం వాటా), సచిన్ (40 శాతం) కలిసి జట్టును కొన్నారు. కానీ ఆర్థికపరమైన అవకతవకల కారణంగా ‘సెబీ’ భారీ జరిమానా విధించడంతో పీవీపీ అనూహ్యంగా తప్పుకుంది. దాంతో ఆ వాటాను కొని ముత్తూట్ గ్రూప్ భాగస్వామిగా మారింది. అయితే ఈ ఒప్పందం కుదరడంలో బాగా ఆలస్యం జరగడంతో ఆర్థికపరమైన కారణాలు జట్టు సన్నాహకాలపై ప్రభావం చూపించాయి. ఆటగాళ్లు, కోచ్ ఎంపిక, మధ్యలోనే కోచ్‌ను తప్పించడం, కోచింగ్ క్యాంప్ జరగకపోవడం... ఇలా అన్నీ గందరగోళంగా మారడంతో బ్లాస్టర్స్ టీమ్ చివరి స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ సారి ముత్తూట్ సంస్థ యాజమాన్య హక్కులు వదిలేసుకుంది.
తగ్గిన సచిన్ వాటా...
మాటీవీ గ్రూప్ చానల్స్‌కు ఇటీవలి వరకు సొంతదారులుగా ఉన్న చిరంజీవి, నాగార్జున, అరవింద్, ప్రసాద్ కొన్నాళ్ల క్రితమే భారీ మొత్తానికి స్టార్ గ్రూప్‌కు దానిని అమ్మేశారు. క్రీడా రంగంలో ఈ బృందం పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. సచిన్‌కు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఫుట్‌బాల్ జట్టు కొనుగోలులో వీరి భాగస్వామ్యం కుదిరింది. అధికారికంగా ఎంత మొత్తం అనే సమాచారం లేకపోయినా...జట్టులో పాత యజమానినుంచి 60 శాతం సహా మొత్తం 80 శాతం వాటాను ప్రసాద్ బృందం సొంతం చేసుకుంది. గతంలో 40 శాతంగా ఉన్న సచిన్ దానిని 20 శాతానికి తగ్గించుకున్నాడు. 2015లో ఒక అంచనా ప్రకారం ఈ టీమ్ విలువ దాదాపు రూ. 200 కోట్లుగా ఉంది. అయితే వాటాలో మార్పులు వచ్చినా... ఇప్పటికీ కేరళ టీమ్‌కు ప్రధాన సూత్రధారి సచినే అనడంలో సందేహం లేదు.