ఐపీఎల్ అంతా ఫిక్సింగే!
ముంబై: వివాదాల్లో ఇప్పటికే నిండా మునిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నటుడు విందూ సింగ్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అసలు గొడవంతా శరద్‌పవార్, శ్రీనివాసన్‌లకు సంబంధించిందేనని, తనలాంటి వారిని పావులుగా మార్చారని అతను అన్నాడు.
ఇక ఆర్‌సీబీ యజమాని విజయ్ మాల్యా అయితే బెట్టింగ్ ద్వారానే కోట్లు గడించారని అన్నాడు. విందూ సింగ్ తమ శూలశోధనలో ఇదంతా బయట పెట్టాడంటూ ‘జీ న్యూస్’ చానల్ ప్రకటించింది. ‘జీ’ కథనం ప్రకారం...బెట్టింగ్‌లో తన పాత్ర ఏమీ లేకపోయినా శరద్ పవార్ చెప్పడం వల్లే జైల్లో ఉండాల్సి వచ్చిందంటూ స్వయంగా తనతో పోలీసులు చెప్పారని విందూ అన్నాడు. అయితే పవార్‌లాంటి పెద్ద వ్యక్తి ముందు నేనెంత అని అతను చెప్పాడు.
ఐపీఎల్‌లో అంతా ఫిక్సింగ్ జరుగుతుందని, విజయ్ మాల్యా ఒక్కడే రూ. 100-200 కోట్లు బెట్టింగ్ ద్వారా సంపాదించారని విందూ వెల్లడించాడు. బాలీవుడ్ తారలంతా బెట్టింగ్ చేస్తారని, అయితే ఫిక్స్ చేయలేరని అతను చెప్పాడు. ఫిక్సింగ్ చేసేవాళ్లు ఆటగాళ్లకు ఒక్కసారిగా రూ. 14-15 కోట్లు ఇచ్చి తమ బుట్టలో పడేసుకుంటారని, ఆ తర్వాత వారు చెప్పినట్లుగా ఆటగాళ్లు చేస్తారని సంచలన వ్యాఖ్య చేశాడు. ఐపీఎల్‌తో బాగా కలిసిపోయిన ఆటగాళ్లు ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లను కూడా ఫిక్స్ చేస్తారన్న విందూ...శ్రీశాంత్ ఎలాంటి తప్పూ చేయలేదని మద్దతు పలికాడు. లలిత్ మోడి సహకారంతో శ్రీనివాసన్‌ను నిలువరించాలన్న శరద్ పవార్ వ్యూహంలో భాగంగానే ఐపీఎల్‌లో ఇన్ని విపరిణామాలు చోటు చేసుకున్నాయని విందూ సింగ్ వెల్లడించాడు.