సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ | Trevor Bayliss named Sunrisers Hyderabad head coach | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌

Published Fri, Jul 19 2019 5:10 AM | Last Updated on Fri, Jul 19 2019 5:10 AM

Trevor Bayliss named Sunrisers Hyderabad head coach - Sakshi

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ జట్టును విశ్వ విజేతగా నిలిపి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్‌ బేలిస్‌... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా) హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు. బేలిస్‌ సైతం ఆస్ట్రేలియాకు చెందినవాడే. కొంతకాలంగా ఇంగ్లండ్‌కు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలోనే ఆ జట్టు 2015 యాషెస్‌ సిరీస్‌ను 3–2 తేడాతో గెల్చుకుంది. 2016 టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరింది. అనంతరం వన్డేల్లో నంబర్‌వన్‌గానూ అవతరించింది.

తాజాగా వన్డే ప్రపంచ కప్‌నూ సాధించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్‌ సిరీస్‌తో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుతో బేలిస్‌ ఒప్పందం ముగియనుంది. దీనికిముందు 2010–11లో అతడు ఆస్ట్రేలియా టి20 లీగ్‌ బిగ్‌ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం శ్రీలంక జాతీయ జట్టుకు పనిచేశాడు. లంక 2011 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ చేరినప్పుడు బేలిస్‌ ఆ దేశ కోచ్‌గా ఉన్నాడు. 2012–15 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సందర్భంలోనూ అతడే శిక్షకుడు. బేలిస్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్‌ సైతం ప్రయత్నించాయి. కోల్‌కతాతో చర్చలు కూడా నడిచినా అవి       ముందుకు సాగలేదు.

మూడీ సేవలకు వీడ్కోలు
సన్‌రైజర్స్‌ కోచ్‌గా టామ్‌ మూడీది విజయవంతమైన ప్రయాణమే. అతడు ఏడు సీజన్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇందులో 2016లో హైదరాబాద్‌ లీగ్‌ విజేతగా నిలవగా, 2018లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. ‘మూడీ స్థానంలో ఫ్రాంచైజీకి కొత్త హెడ్‌ కోచ్‌ను నియమించాలన్నది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. జట్టు భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసేందుకు అతడు సరైనవాడు ’ అని సన్‌ యాజమాన్యం ఓ   ప్రకటనలో పేర్కొంది. జట్టుపై మూడీ ప్రభావాన్ని ఈ సందర్భంగా కొనియాడింది. ‘సన్‌ రైజర్స్‌ పురోగతి, విజయాల్లో మూడీది చెరగని ముద్ర. లీగ్‌లో అత్యధిక కాలం కోచ్‌గా పనిచేశాడు. అయినా       కొత్తవారికి కోచింగ్‌ బాధ్యతలు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది’ అని సన్‌రైజర్స్‌ సీఈవో షణ్ముగం తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement