ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి.
ఫ్లవర్‌ను తప్పించి లాంగర్‌ను ఎంచుకున్న లక్నో..
లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్‌కు చేరింది.
బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్
2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్‌లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ గత సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం.
ఫ్లవర్‌కు భలే గిరాకి..
లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్‌లో భలే గిరాకి ఉంది. కోచ్‌గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్‌ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్‌తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఆర్సీబీలో కీలక మార్పులు..
2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్‌లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్‌ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment