ముక్కోణపు వన్డే సిరీస్ మనదే
►శ్రేయస్ అయ్యర్ అజేయ శతకం
►ఫైనల్లో దక్షిణాఫ్రికా ‘ఎ’పై విజయం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ (131 బంతుల్లో 140 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇప్పటిదాకా జరిగిన నాలుగు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ల్లో కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించని అతను మంగళవారం నాటి తుది పోరులో మాత్రం చివరి బంతి వరకు నిలిచి దుమ్ము రేపాడు. ఫలితంగా ప్రొటీస్ జట్టుపై భారత్ ‘ఎ’ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో నాలుగేళ్ల క్రితం గెలుచుకున్న ముక్కోణపు సిరీస్‌ను తిరిగి నిలబెట్టుకున్నట్టయ్యింది. విజయ్ శంకర్ (86 బంతుల్లో 72; 9 ఫోర్లు) కూడా రాణించాడు. అఫ్ఘానిస్తాన్ ‘ఎ’ జట్టు కూడా ఈ సిరీస్‌లో పాల్గొంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 267 పరుగులు చేసింది. బెహర్డీన్ (114 బంతుల్లో 101 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకం సాధించగా... ప్రిటోరియస్ (61 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. శార్దుల్ ఠాకూర్‌కు మూడు, సిద్దార్థ్ కౌల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 46.5 ఓవర్లలో మూడు వికెట్లకు 270 పరుగులు చేసి నెగ్గింది. అయ్యర్, శంకర్ కలిసి మూడో వికెట్‌కు 141 పరుగులు జత చేశారు. కెప్టెన్ మనీష్ పాండే (38 బంతుల్లో 32 నాటౌట్; 1 సిక్స్) ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు నాటౌట్‌గానే నిలిచి శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు దాదాపుగా చోటు ఖాయం చేసుకున్నాడు.