అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండగొచ్చేసింది.
ఢాకా: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండగొచ్చేసింది. ఉపఖండంలో జరిగే ఈ టోర్నీకి రంగం సిద్ధమైంది. మామూలు మ్యాచ్ లు భిన్నంగా ఉండే ట్వంటీ-20 మ్యాచ్ లు అంటేనే అనిశ్చితి మారుపేరు. కేవలం ఒక్క ఓవర్ లో నే మ్యాచ్ స్వరూపమే పూర్తిగా మారిపోయే ట్వంటీ 20 అంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఈ మెగా ఈవెంట్ లోఎవరు విజేతగా నిలుస్తారో చెప్పడం కష్టమే. ఇందులో మూడు పసికూన జట్లు కూడా తమ ఇన్నింగ్స్ ఘనంగా ఆరంభించేందుకు సన్నద్ధమైయ్యాయి.
నేపాల్, హాంకాంగ్, యూఏఈ జట్లు తొలిసారి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గత కొన్నేళ్లు క్రికెట్ బరిలో అడుగుపెట్టాలన్న ఆ మూడు జట్ల నిరీక్షణ ముగిసి పొట్టి ఫార్మెట్ వరల్డ్ కప్ లో పాల్గొననున్నాయి. ముందుగా ఎనిమిది పసికూన జట్ల మధ్యే క్వాలిఫయింగ్ పోరు జరగనుంది. గతానికి భిన్నంగా ఈ టి20 ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ ద్వారా రెండు జట్లు మాత్రమే అగ్రశ్రేణి జట్లున్న ప్రధాన రౌండ్‌లోకి అడుగుపెడతాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ప్రధాన రౌండ్‌లో తమ సత్తాను నిరూపించుకుంటాయి.
ఈ మధ్య కాలంలో పేలవమైన ప్రదర్శనతో వెనకబడిపోయిన టీం ఇండియా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ముఖ్యంగా ఈ మెగా టోర్నీ మాత్రం కొంతమంది భారత ఆటగాళ్లకు పరీక్షా కాలంగానే చెప్పవచ్చు. టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించి కెప్టెన్ గా వెనుకంజలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనికి సవాల్ గా నిలవనుంది. ఎప్పుడూ సమస్యలను సవాల్ గా స్వీకరించే అలవాటు ఉన్న ధోని ఈ టోర్నీతో విజయాలబాట పట్టాలని ఆశిద్దాం.