అజేయం... అమేయం | Under-19 World Cup: Difficult to express my feelings in words | Sakshi
Sakshi News home page

అజేయం... అమేయం

Published Sun, Feb 4 2018 1:11 AM | Last Updated on Sun, Feb 4 2018 1:11 AM

Under-19 World Cup: Difficult to express my feelings in words - Sakshi

భారత అండర్‌–19 కుర్రాళ్లు

భారత అండర్‌–19 కుర్రాళ్లు ఇంతకుముందూ ప్రపంచకప్‌లు గెలిచారు! ఒక్కసారి కాదు మూడుసార్లు జగజ్జేతలుగా నిలిచారు! వీరి నుంచి ఎందరో ఆటగాళ్లు సీనియర్‌ జట్టుకు ఆడారు... ఆడుతున్నారు! కానీ దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణ కారణంగానో, సంచలనాల పృథ్వీ షా సారథ్యం రీత్యానో అప్పుడెప్పుడూ లేనంతటి అంచనాలు, విశ్లేషణలు ఇప్పటి జట్టుపై వచ్చాయి. ఆ భారం మోస్తూనే కుర్రాళ్లు లక్ష్యం సాధించారు. టోర్నీలో ఒక్క మ్యాచూ కోల్పోకుండా అజేయంగా నిలిచిన యువ జట్టు... అమేయంగానూ కనిపించింది. ప్రత్యర్థులు (క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌) ఒక్కసారి మాత్రమే, అదీ చివరి ఓవర్లో కాని పృథ్వీ బృందాన్ని ఆలౌట్‌ చేయలేకపోయారంటేనే మనకూ మిగతా వారికి మధ్య ఉన్న తేడా తెలుస్తోంది. అదే సమయంలో ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థులను చుట్టేసింది. ఫైనల్లో తలపడిన ఆస్ట్రేలియా సహా... ప్రతి జట్టుపైనా ద్రవిడ్‌ శిష్యులది భారీ విజయమే. తొలి మ్యాచ్‌లో ఏకంగా 100 పరుగులతో ఓడిన ఆసీస్‌ ఫైనల్లోనూ తేలిపోయింది. అసలు అవతలి జట్లు పోటీనే కాదన్నట్లు సాగింది యువ భారత్‌ ఆటతీరు. ఈ ప్రదర్శన భవిష్యత్‌ తారలుగా ఎంతోమందిని వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడిక వీరు చేయాల్సిందిల్లా ప్రచార పటాటోపంలో పడి కట్టుతప్పకుండా ఉండటం, యువరాజ్, కోహ్లి, చటేశ్వర్‌ పుజారా తదితరుల్లా ఉజ్జ్వల కెరీర్‌ను నిర్మించుకోవడమే! 

వీరిపై ఓ కన్నేయండి... 
ప్రస్తుత విజేత జట్టులోని కనీసం ఐదారుగురు జాతీయ జట్టుకు ఆడే స్థాయిలో కనిపిస్తున్నారు. పృథ్వీ షా ఇప్పటికే ఆ మేరకు పేరు తెచ్చుకున్నాడు. ఈ ప్రపంచకప్‌ ద్వారా ఉనికిని బలంగా చాటుకున్న శుభ్‌మన్‌ గిల్‌ కూడా ముందు వరుసలో ఉంటాడు. పరుగుల్లో తమ కెప్టెన్‌నే వెనక్కు నెట్టిన ఈ పంజాబీ కెరటం ఆహార్యం, ఆట, దృక్పథంలో అచ్చం కోహ్లిని తలపిస్తున్నాడు. మరో బ్యాట్స్‌మన్‌ మన్‌జ్యోత్‌ కల్రా ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ నభూతో...! గంగూలీ, యువరాజ్, శిఖర్‌ ధావన్‌ తర్వాత అంతటి నైపుణ్యమున్న ఆటగాడిగా మన్‌జ్యోత్‌ కనిపిస్తున్నాడు. దృఢమైన శరీరంతో పాటు చక్కటి టైమింగ్, ఉత్తర భారత ఆటగాళ్ల సహజ లక్షణమైన దూకుడు ఈ ఢిల్లీ కుర్రాడి ఇతడి సొంతం. ఫైనల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్నందించిన మన్‌జ్యోత్‌ను ఓ ఆశాజ్యోతిగా భావించవచ్చు. 

వారెవ్వా... ఏమి పేసు! 
గంటకు 145 కి.మీ! ఒకప్పుడు దేశం మొత్తం గాలించినా ఇంత వేగంతో బంతులేసే పేసర్‌ ఒక్కరూ దొరికేవారు కాదు. కానీ ఈ జట్టులోని శివం మావి, కమలేశ్‌ నాగర్‌కోటి స్థిరంగా 140 కి.మీ.పైగా వేగంతో బంతులేసి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. అందరూ మావి వేగం గురించి చెప్పుకొంటుంటే, తానేం తక్కువ కాదన్నట్లు నాగర్‌కోటి ఓ మ్యాచ్‌లో 149 కి.మీ. నమోదు చేశాడు. వీరికితోడు ఇషాన్‌ పొరెల్‌. సెమీస్, ఫైనల్లో ఆదిలోనే వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. ఈ ముగ్గురిలో ఇద్దరైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీరితోపాటు ఎడమచేతి వాటం స్పిన్నర్లు అనుకూల్‌ రాయ్, శివ సింగ్, అభిషేక్‌ శర్మ కూడా ప్రతిభావంతులే. వాస్తవానికి ఫైనల్లో కీలక దశలో నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌కు అడ్డుకట్ట వేసింది వీరే. టోర్నీలో 14 వికెట్లు పడగొట్టిన అనుకూల్‌ ఇప్పటికే సమస్తిపూర్‌ జడేజాగా పేరు తెచ్చుకున్నాడు. జట్టు ఫీల్డింగ్‌ ప్రమాణాలూ బాగుండటంతో తిరుగులేని విజయాలు సాధించగలిగింది. 

గురువా... అందుకో మా దక్షిణ... 
ఎన్నో అవకాశాలు వచ్చినా, యువ భారత్‌కు శిక్షణ ఇవ్వడాన్నే తన బాధ్యతగా ఎంచుకున్న రాహుల్‌ ద్రవిడ్‌కు కుర్రాళ్లు అత్యద్భుత బహుమతిని అందించారు. సీనియర్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా 2003లో, కెప్టెన్‌గా 2007లో ప్రపంచ కప్‌ చేదు అనుభవాలు ఎదుర్కొన్న ద్రవిడ్‌కు వ్యక్తిగతంగానూ తాజా విజయం ఎనలేని సంతృప్తినిచ్చి ఉంటుంది.  మ్యాచ్‌ ముగిశాక బహుమతుల ప్రదానోత్సవానికి వస్తున్నప్పుడు ‘ది వాల్‌’ ముఖం గమనిస్తే... అతడు ఉద్వేగానికి లోనైనట్లు కనిపించింది. ఏదేమైనా ఆటగాడిగా తీరని కోరికను అతడు ఈ విధంగా నెరవేర్చుకున్నాడు. 
– సాక్షి క్రీడా విభాగం

సుదీర్ఘ ప్రయాణం ముందుంది...  
కుర్రాళ్లను చూసి గర్విస్తున్నా. వారు నిజంగా అర్హులే. 14 నెలల మా సన్నాహకాలు ఫలించాయి. ప్రపంచకప్‌ విజయం ‘ఒక్క అనుభూతి’గా మారకూడదు. ప్రతిభావంతులైన ఈ కుర్రాళ్లకు సుదీర్ఘ, సవాళ్ల ప్రయాణం ముందుంది. బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ సహా ఏడెనిమిది మంది ఉన్న మా సహాయక సిబ్బంది అంకితభావం అత్యద్భుతం. ఆటగాళ్లకు ఏది మంచో అది అందించేందుకు ప్రయత్నించాం. దానిని వారు తమ ప్రదర్శనలో చూపారు.    
 – భారత కోచ్‌  ద్రవిడ్‌   

అభినందనల వెల్లువ
ప్రపంచ విజేతలుగా నిలిచిన భారత యువ ప్రతిభావంతులకు అభినందనలు. ప్రతిభ, పట్టుదల కలగలిసిన విజయమిది. కెప్టెన్‌ పృథ్వీ షా, కోచ్‌ ద్రవిడ్‌లను చూసి గర్విస్తున్నా.     
– రామ్‌నాథ్‌ కోవింద్, రాష్ట్రపతి 
 
మన యువ క్రికెటర్లు ఘనత చూసి అచ్చెరువొందాను. ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది.     
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి  
 
భారత జట్టుకు నా అభినంనదలు. ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఆటగాడు భవిష్యత్తులో మరింత గొప్పగా ఎదగాలి. 
– కె.చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి

భారత యువ జట్టు నాలుగోసారి ప్రపంచ కప్‌ సొంతం చేసుకోవడం గర్వకారణం. భవిష్యత్తులో జట్టు ఇదే విజయాల ఒరవడిని కొనసాగించాలి. 
– వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  

సమష్టి శ్రమతోనే పెద్ద కలలు సాకారమవుతాయి. మేం గర్వపడేలా చేసిన ప్రపంచ చాంపియన్లకు నా అభినందనలు. కుర్రాళ్లకు దిశానిర్దేశం చేసిన ద్రవిడ్, పారస్‌లకు ధన్యవాదాలు. 
– సచిన్‌ టెండూల్కర్, దిగ్గజ క్రికెటర్‌  

ఎంత అద్భుతమైన విజయమిది. దీనిని పునాదిగా మార్చుకొని ముందుకు వెళ్లండి. జీవితంలో మీరింకా చాలా దూరం వెళ్లాలి. విజయపు క్షణాన్ని ఆస్వాదించండి.
 – కోహ్లి, భారత సీనియర్‌ జట్టు కెప్టెన్‌ 

భారత్‌కు ఆడబోయే కొత్త తరం వచ్చేసింది.  రోజంతా ఫైనల్‌ మ్యాచ్‌ చూశాను. కుర్రాళ్లందరూ చాలా బాగా ఆడారు.     
– కపిల్‌ దేవ్, మాజీ కెప్టెన్‌ 
 

భారత జట్టుకు నా అభినందనలు. అండర్‌–19 జట్టు చాలా బాగుంది. ద్రవిడ్‌ రూపంలో గొప్ప కోచ్, మార్గదర్శి ఉన్నాడు. భవిష్యత్తు వీరిదే. 
– షాహిద్‌ ఆఫ్రిది, పాక్‌ మాజీ క్రికెటర్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement