
సాక్షి, హైదరాబాద్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత యువ పేసర్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి మొహమ్మద్ గౌస్ (53) శుక్రవారం మృతి చెందారు. కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్ ముగించిన తర్వాత కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లి కలిసి సిరాజ్‌కు ఈ సమాచారం అందించారు. ఐపీఎల్‌లో సిరాజ్ కోల్‌కతాపై జట్టుపై అద్భుత ప్రదర్శన (3/8) చేసిన రోజే అతని తండ్రి ఆస్పత్రిలో అడ్మిట్ అయినా... ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేసిన గౌస్ కుమారుడిని ఈ స్థాయికి చేర్చడంలో ఎంతో శ్రమించారు.
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న క్వారంటైన్ నిబంధనల కారణంగా సిరాజ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదు. దాంతో అతను తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ పేసర్ టెస్టు సిరీస్ కోసమే జట్టులోకి ఎంపికయ్యాడు. ‘చాలా బాధగా ఉంది. పెద్ద దిక్కును కోల్పోయాను. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఆయన కోరికను తీర్చగలిగాను. జాతీయ జట్టు తరఫున నేను ఎప్పుడూ బాగా ఆడాలని ఆయన కోరుకున్నారు. నేను క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో కోచ్, కెప్టెన్ నాకు ధైర్యం చెప్పారు’ అని సిరాజ్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment