
'ఒలింపిక్స్ నిర్వహణ అంత ఈజీ కాదు'
బీజింగ్: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశానికైనా ఒలింపిక్స్ నిర్వహణ అనేది ఒక పెద్ద సమస్యనేనని చైనా స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ వైస్ డైరెక్టర్ గో జిదాన్ స్పష్టం చేశారు. గతంలో తాము ఒలింపిక్స్ను నిర్వహించే క్రమంలో అనేక సాధక బాధలను అధిగమించాల్సి వచ్చిందన్నారు. అసలు ఒలింపిక్స్ ను నిర్వహించడం ఎంత కష్టమో, బ్రెజిల్కు త్వరలోనే తెలుస్తుందన్నారు. కాలుష్యాన్ని నియంత్రిచడంతో పాటు భద్రతా పరమైన సమస్యలను అధిగమించడం, మౌలిక సదుపాయాలను సమకూర్చడం వంటివి అతి పెద్ద సవాల్ అని జిదాన్ అన్నారు.
'మేము 2008లో ఒలింపిక్స్ నిర్వహించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాటిని అధిగమించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఏ దేశమైనా ఒలింపిక్స్ ను నిర్వహించాలంటే అంత ఈజీ కాదు. చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్న రియోలో పరిస్థితిని అర్ధం చేసుకోగలం. అక్కడ ప్రబలిన ప్రాణాంతక జికా వైరస్ కూడా రియోలో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. అందుకోసం దోమ నిరోధక స్ర్పేలను ఆయా జట్లకు ఇస్తున్నారు. దీంతోపాటు ట్రైనింగ్ సెషన్లో ప్రత్యేక మార్గదర్శకాలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. వివిధ దేశాల నుంచి వచ్చే వారికి అత్యంత భద్రతతో కూడిన ఏర్పాట్లు చేయాలి.నిబంధనల్ని కఠినంగా అమలు చేసినప్పుడే ఒక మెగా ఈవెంట్ను సమర్ధవంతంగా నిర్వర్తించగలం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రియో గేమ్స్ సాగుతాయని ఆశిస్తున్నా'అని జిదాన్ తెలిపారు.