రియో ఒలింపిక్స్ వేదికపై క్రీడాస్ఫూర్తితోపాటు.. ప్రేమలూ చిగురిస్తున్న సంగతి తెలిసిందే.
రియో ఒలింపిక్స్ వేదికపై క్రీడాస్ఫూర్తితోపాటు.. ప్రేమలూ చిగురిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చైనీస్ క్రీడాకారిణికి ఆమె ప్రియుడు జీవితకాలం గుర్తుండిపోయే కానుకను ఇచ్చాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం అందుకొని మురిసిపోతున్న ఆమెకు నిశ్చితార్థ ఉంగరం కానుకగా ఇచ్చాడు. నన్ను పెళ్లిచేసుకుంటావా? అని కోరాడు. కళ్లనిండా నిండిన ఆనందబాష్పాలతో, సంభ్రమాశ్చార్యాలతో ఆ చిన్నది ప్రియుడి కోరికను మన్నించింది.
చైనీస్ డైవింగ్ క్రీడాకారిణి హె జీ (25)కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డు డైవింగ్ ఈవెంట్‌లో అద్భుతమైన విన్యాసాలు కనబర్చిన హె జీ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మెడల్ అందుకొని ఆమె పొడియం దిగగానే.. ఆమె ప్రియుడు, సహచర డైవింగ్ ఆటగాడు కిన్ కై (30) ఆమెను సమీపించాడు. అతడు మోకాళ్లపై కూచొని తాను తెచ్చిన ఓ చిన్ని కానుకను ఆమెకు అందించాడు. చిన్ని పెట్టేలో ఉన్న ఆ కానుకను చూసి ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అది నిశ్చితార్థ ఉంగరం. అతడి ప్రేమ ప్రతిపాదనను ఆమె అంగీకరించింది. ఆమె వేలికి అతడు ప్రేమగా ఉంగరం తొడిగి.. తన దానిని చేసుకున్నాడు. ఈ హృద్యమైన ప్రేమఘట్టం చూస్తున్న ప్రేక్షకులను కదిలించింది. వారు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఈ క్రీడాప్రేమికులను నిండుమనస్సుతో దీవించారు.