న్యూఢిల్లీ: ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మధ్యప్రదేశ్ పరుగు వీరులకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అత్యవసర ట్రయల్స్ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వివరించారు. కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో బోల్ట్ కన్నా వేగంగా 100 మీ. దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తిచేసిన శ్రీనివాస్ గౌడ (కర్ణాటక), మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్ గుర్జార్‌లకు సోషల్ మీడియాలో విపరీత ఆదరణ దక్కింది. భారత్‌కు మరో ఉసేన్ బోల్ట్ దొరికాడంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారికి ట్రయల్స్ నిర్వహించగా అంచనాలను అందుకోలేదని తాజాగా కిరణ్ రిజిజు ప్రకటించారు.
‘గుర్జార్ పరుగెత్తుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పుడు నేను స్పందించకుండా ఉంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించేవారు. అతనికి ట్రయల్స్ నిర్వహించగా గుర్జార్ అతికష్టమ్మీద 12.9 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేశాడు. ట్రయల్స్‌లో జూని యర్లతోనే పోటీపడలేకపోయాడు. అతని వయస్సు 26 ఏళ్లు కాబట్టి ఇప్పుడు అతనికి కొత్తగా శిక్షణ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే ట్రయల్స్ నిర్వహించాం. అంతర్జాతీయ స్ప్రింట్ ప్రమాణాలపై సరైన అవగాహన లేకుండానే అతను బోల్ట్‌ను మించగలడంటూ దేశమంతా నమ్మింది’ అంటూ రిజిజు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment