మరియా షరపోవాకు మరో షాక్!
మరియా షరపోవాకు మరో షాక్!
Published Wed, Mar 16 2016 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు మరో షాక్ తగిలింది. డోపింగ్ కేసు వివాదం నేపథ్యంలో తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మారియా షరపోవాను సస్పెండ్ చేసినట్టు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. రక్తప్రసరణను పెంచేందుకు ఉద్దేశించిన నిషేధిత మెల్డోనియం ఉత్ర్పేరకాన్ని తీసుకున్నట్టు డోపింగ్ పరీక్షల్లో షరపోవా పట్టుబడటంతో ఆమె నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది. ప్రస్తుతం ఆమెపై ప్రపంచ టెన్నిస్ సమాఖ్య తాత్కాలిక సస్పెన్షన్ విధించింది.
'షరపోవా తాజా ప్రకటన నేపథ్యంలో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె హోదాను సస్పెండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగినంతకాలం ఆమెతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోం' అని న్యూయార్‌లోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం ఓ ప్రకటనలో తెలిపింది. చెర్నాబిల్ అణువిపత్తు వ్యవహారంలో తమ సహాయ కార్యక్రమాలకు మద్దతు తెలిపినందుకు షరపోవాకు కృతజ్ఞతలు తెలిపింది. 2007 నుంచి పేదరికం, అసమానతలపై పోరాడేందుకు ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా షరపోవా కృషి చేస్తున్నది. చెర్నాబిల్ అణువిపత్తు వల్ల బెలారస్‌లో ప్రభావితమైన ప్రజలకు ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌లు అందించేందుకు అవసరమైన విరాళాలు సేకరించేందుకు యూఎన్‌డీపీతో కలిసి షరపోవా చారిటబుల్ ట్రస్టు కృషి చేసింది.
Advertisement