
మళ్లీ ఓడిన టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది.
ప్రొ కబడ్డీ లీగ్
లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 23–25 స్కోరుతో యూపీ యోధ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది ఎనిమిదో ఓటమి. గత మ్యాచ్‌లో యు ముంబాపై అద్భుత విజయాన్ని సాధించిన టైటాన్స్ ఈ మ్యాచ్‌లోనూ పోరాడింది. అయితే ప్రత్యర్థి రైడర్ల జోరు ముందు తలవంచింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరి విఫలమయ్యాడు. 23 సార్లు రైడింగ్‌కు వెళ్లిన రాహుల్ కేవలం 4 పాయింట్లే చేశాడు.
ఓవరాల్‌గా అతను 6 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో ఫర్హాద్ మిలగర్దన్ 4, సోంబిర్ 3 పాయింట్లు చేశారు. యోధ తరఫున నితిన్ తోమర్ (6), నితీశ్ కుమార్ (5) కీలక పాయింట్లు సాధించారు. సురేందర్ సింగ్, జీవ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్‌పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.