ముగురుజా మెరిసె... | US Open: Garbine Muguruza beats Varvara Lepchenko to reach second round | Sakshi
Sakshi News home page

ముగురుజా మెరిసె...

Published Tue, Aug 29 2017 12:52 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

ముగురుజా మెరిసె... - Sakshi

ముగురుజా మెరిసె...

తొలి రౌండ్‌లో అలవోక విజయం
యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ


నేటి మ్యాచ్‌లు రాత్రి గం.8.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం
సెరెనా విలియమ్స్, అజరెంకా లాంటి స్టార్‌ క్రీడాకారిణుల గైర్హాజరీలో ఫేవరెట్‌గా మారిన మూడో సీడ్‌ గార్బిన్‌ ముగురుజా యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. గతంలో ఈ టోర్నీలో  నాలుగుసార్లు ఆడినా, రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయిన ఈ స్పెయిన్‌ స్టార్‌ ఈసారి మాత్రం ఏకంగా టైటిల్‌పైనే గురి పెట్టింది.ఈ ఏడాది వింబుల్డన్‌ టైటిల్‌ సొంతం చేసుకొని అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముగురుజా తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించి టైటిల్‌ వేటను మొదలుపెట్టింది.  

న్యూయార్క్‌: సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సీడెడ్‌ క్రీడాకారిణులు ముగురుజా (స్పెయిన్‌), పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) బోణీ చేశారు. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ ముగురుజా 6–0, 6–3తో వర్వారా లెప్‌చెంకో (అమెరికా)ను ఓడించగా... 13వ సీడ్‌ క్విటోవా 7–5, 7–5తో మాజీ నంబర్‌వన్‌ జెలెనా జంకోవిచ్‌ (సెర్బియా)పై, 18వ సీడ్‌ గార్సియా 6–0, 6–1తో మార్టిన్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందారు.
లెప్‌చెంకోతో జరిగిన మ్యాచ్‌లో ముగురుజాకు ఏ దశలోనూ తన ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు.

యూఎస్‌ ఓపెన్‌లో అంతగా మెరుగైన రికార్డు లేని ముగురుజా ఈసారి మాత్రం ఫేవరెట్స్‌లో ఒకరిగా ఉంది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ముగురుజా కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేసింది. తొలి సెట్‌లో ఒక్క గేమ్‌ కూడా కోల్పోని ఈ స్పెయిన్‌ స్టార్‌ రెండో సెట్‌లో మాత్రం తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకుంది. 16 విన్నర్స్‌ కొట్టిన ఆమె నెట్‌ వద్దకు 17సార్లు దూసుకొచ్చి 15సార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు పదోసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న క్విటోవా ఈ టోర్నీలో ఒక్కసారి కూడా క్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటలేకపోయింది. మాజీ నంబర్‌వన్‌ జంకోవిచ్‌తో జరిగిన పోరులో క్విటోవా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి గెలిచింది. 90 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 28 విన్నర్స్‌ కొట్టిన ఈ చెక్‌ స్టార్‌ 31 అనవసర తప్పిదాలు చేసింది. అయితే కీలకదశలో జంకోవిచ్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేయడంద్వారా క్విటోవా మ్యాచ్‌ ఫలితాన్ని శాసించింది.

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సోఫియా కెనిన్‌ (అమెరికా) 7–5, 7–5తో 32వ సీడ్‌ లారెన్‌ డేవిస్‌ (అమెరికా)పై, క్రిస్టినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–2తో ఎగుచి (జపాన్‌)పై, అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌) 6–4, 6–4తో హీతెర్‌ వాట్సన్‌ (బ్రిటన్‌)పై, మగ్దలీనా రిబరికోవా (స్లొవేకియా) 6–3, 6–4తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో 32వ సీడ్‌ రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌) 6–3, 7–5, 6–3తో హాస్‌ను బోల్తా కొట్టించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 12వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌) 6–3, 6–2, 7–6 (7/5)తో ఇవాన్‌ కింగ్‌ (అమెరికా)పై నెగ్గగా... కామెరూన్‌ నోరి (బ్రిటన్‌) 7–6 (9/7), 6–1తో ఆధిక్యంలో ఉండగా అతని ప్రత్యర్థి తుర్సునోవ్‌ గాయం కారణంగా వైదొలిగాడు.  

నాలుగో సీడ్‌గా సానియా జంట
మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) జోడీకి నాలుగో సీడ్‌ లభించింది. తొలి రౌండ్‌లో ఈ జంట పెట్రా మార్టిక్‌–డోనా వెకిక్‌ (క్రొయేషియా)లతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జోడీకి పదో సీడింగ్‌ దక్కింది. తొలి రౌండ్‌లో ఈ ద్వయం బ్రాడ్లీ క్లాన్‌–స్కాట్‌ లిప్‌స్కీ (అమెరికా) జంటతో ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement