విజయవాడ: ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయాలని వెటరన్ కబడ్డీ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కబడ్డీ అసోసియేషన్‌లో వెలుగు చూసిన ఆరోపణలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొన్న వారు.. ప్రధానంగా తమకు అన్యాయం జరిగిందని, వేధిస్తున్నారని ఆడపిల్లలు బయటకొచ్చి చెప్పడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇంత జరుగుతున్నా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇందుకు ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయడమే ఉత్తమమైన మార్గమని వారు సూచించారు. ఈ మేరకు నగరంలోని రైల్వే ఇనిస్టిట్యూట్ ఆడిటోరియంలో సమావేశమైన వెటరన్ కబడ్డీ క్రీడాకారులు.. క్రీడాకారిణుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి వీరలంకయ్యను తిరిగి కార్యదర్శిగా నియమించడాన్ని వారు తప్పుబట్టారు. దీనిపై కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ‍్నించారు. బాధితులకు అండగా ఉన్న శ్రీకాంత్‌ను జిల్లా అసోసియేషన్‌ను తొలగించిన పెద్దలు.. వీర లంకయ్యపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కనీసం క్రీడాకారుల ఆరోపణలపై కమిటీని కూడా వేయకుండా వీర లంకయ్యను వెనుకేసుకొస్తున్నారన్నారు. ఏపీ కార్యదర్శి హోదాలో వీర లంకయ్య అనేక అక‍్రమాలకు పాల్పడటం వాస్తవమన్నారు.
జిల్లా అసోసియేషన్ ను రద్దు చేసిన పెద్దలు.. ఏపీ అసోసియేషన్ ను ఎందుకు రద్దు చేయలేదన్నారు. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పేందుకు ఈ ఘటనే ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. ఎంతో మంది ఆడపిల్లలు రోడ్డెక్కి ఆవేదన చెప్పినా .. పట్టించుకోకుండా నిందితుడిగా ఉన్న వ్యక్తికి అండగా నిలవడం బాధాకరమన్నారు. ఇలా అయితే ఆడపిల్లలు క్రీడల్లోకి పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతారన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి .. క్రీడాకారులకు న్యాయం చేయాలని వెటరన్ క్రీడాకారుల హోదాలో సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. క్రీడా సంఘంలో సీనియర్ క్రీడాకారులు ఉండేలా చూస్తే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు.