నేను మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ని.. మోసగాణ్ని
క్రైస్ట్చర్చ్: గతేడాది మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి జీవిత కాల నిషేధానికి గురైన న్యూజిలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్.. ప్రపంచ క్రికెటర్లకు వినూత్నమైన సందేశమిచ్చాడు. 'నేను లూ విన్సెంట్ను. మోసగాణ్ని. క్రికెటర్లూ.. నాలా అవినీతి ఉచ్చులో పడకండి. నిజాయతీగా ఆడండి' అని విన్సెంట్ హెచ్చరించాడు. ప్రపంచ కప్లో ఆడేందుకు వచ్చిన 14 దేశాలకు చెందిన దాదాపు 200 క్రికెటర్లకు విన్సెంట్ వీడియో సందేశం ద్వారా సూచించాడు.
విన్సెంట్తో ఈ వీడియో సందేశాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రికార్డు చేయించింది. 30 సెకెన్ల నిడివి గల ఈ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త ఆతిథ్యంలో శనివారం నుంచి ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ మాట్లాడుతూ.. ఏ టోర్నమెంట్లోనైనా అవినీతే లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇవ్వలేమని, సాధ్యమైనంతవరకు అవినీతిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆటగాళ్లతో పాటు అంపైర్లు, గ్రౌండ్స్మెన్, అధికారులు అందరిపైనా నిఘా ఉంచుతామని తెలిపారు.