
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రెండో వన్డేలో యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడని టీమిండియా కెప్టెన్ కోహ్లి కితాబిచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బీసీసీఐ వెబ్‌సైట్ కోసం సహచరుడు యజువేంద్ర చహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ... ‘బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్–3 బ్యాట్స్‌మెన్‌లో ఒకరైనా నిలబడి భారీస్కోరు చేస్తేనే ఇన్నింగ్స్ నిలబడుతుంది. ఓపెనర్లు శిఖర్, రోహిత్ విఫలమవడంతో ఇన్నింగ్స్ బాధ్యత నేను తీసుకున్నా. పిచ్, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 270 పరుగుల స్కోరు మంచి లక్ష్యమే అనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ తీసుకుని మంచి పనే చేశాం.
మీరు విండీస్ ఇన్నింగ్స్‌ను గమనిస్తే అదే అర్థమవుతుంది. లక్ష్యఛేదనలో ఆతిథ్య జట్టు తెగ కష్టపడింది. ఆ సమయంలో ఎవరికైనా బ్యాటింగ్ క్లిష్టమే అవుతుంది. హెట్‌మైర్, పూరన్ నిలదొక్కుకుంటున్న సమయంలో వాన పడటం కూడా మాకు కలిసొచ్చింది. ఈ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి బ్యాట్స్‌మెన్ ఉండటం వల్లే చహల్‌ను కాదని కుల్దీప్‌ను తీసుకున్నాం. ఈ ఎత్తుగడ కూడా మమ్మల్ని గెలిపించేందుకు దోహదపడింది’ అని అన్నాడు. వర్షం, బ్రేక్ సమయంలో తన డ్యాన్సింగ్‌పై మాట్లాడుతూ ‘విండీస్ సంగీతం వినపడగానే నా రెండు కాళ్లు ఆగవు. చిందులేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఆట విరామంలో ఈ సరదా కూడా ఉత్సాహపరుస్తుంది’ అని అన్నాడు.