'చీకటిలోనూ కోహ్లీ మెరుపులు చిమ్మగలడు'
న్యూఢిల్లీ: భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సూపర్ ఫాం కొనసాగిస్తుండటంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. అర్ధరాత్రి విద్యుత్ దీపాలు లేకున్నా కోహ్లి బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టగలడని, అంతటి ఫాంను అతను కొనసాగిస్తున్నాడని గవస్కర్ అన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ట్వంటీ-20లో కోహ్లి చెలరేగి ఆడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో టీ-20 మ్యాచ్‌లోనూ కోహ్లి మెరుపు హాఫ్ సెంచరీ బాది టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఈ నేపథ్యంలో గవస్కర్ మాట్లాడుతూ 'భావి ఆటగాళ్ల కోసం కోహ్లి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాడు. అతను అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. ఆటగాళ్లు కలలు కనే ఫాంను అతను కొనసాగిస్తున్నాడు. అతను అర్ధరాత్రి లైట్లు లేకున్నా బాగా ఆడగలడు. ఆస్ట్రేలియన్లు అతన్ని అంత త్వరగా పెవిలియన్ బయటకు పంపించలేరు. కోహ్లి పొరపాటుచేసే వరకు వాళ్లు వేచిచూడక తప్పదు' అని గవస్కర్ అన్నారు.
ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక టీ-20 సిరీస్‌ను భారత్ కైవసం చేస్తున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయకూడదని గవస్కర్ సూచించారు. మళ్లీ జట్టులో చోటు సంపాదించిన యువరాజ్ సింగ్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కోసమైన మూడోస్థానంలో పంపించాల్సిన అవసరముందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.