భారత్ జట్టు
సఫారీలతో సిరీస్ ముగిశాక తమ సామర్థ్యంలో 80 శాతమే కనబర్చామని ప్రకటించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి... సాధ్యమైనంత త్వరగా 100 శాతం ఆటను ప్రదర్శించేలా బాజా మోగించాడు. దక్షిణాఫ్రికాపై ప్రత్యేకించి పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో భారత్ అన్ని విభాగాల్లో సొంత సామర్థ్యాన్ని నమ్ముకుని అవసరమైన సందర్భాల్లో ఉత్తేజకరమైన ఆట కనబరిచింది. ఇదే పనిని ప్రత్యర్థి చేయలేకపోయింది. టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో లోయరార్డర్‌తో పెద్దగా పని పడలేదు. ప్రారంభంలో, చివర్లో పరుగులు ఇవ్వకుండా కొత్త బంతి బౌలర్లు ప్రొటీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. మధ్య ఓవర్లలో స్వేచ్ఛగా ఆడదామనుకుంటే మణికట్టు స్పిన్నర్లు ఆశ్చర్యానికి గురిచేశారు. కుల్దీప్, చహల్‌లు వారిని తప్పుదారి పట్టించి పాఠశాల స్థాయి క్రికెటర్లుగా మార్చేశారు. ఈ ఇద్దరి మాయాజాలం, ధైర్యం, అద్భుత ఆత్మవిశ్వాసంతో భారత్ మున్ముందు టెస్టుల్లోనూ మరిన్ని విజయాలు సాధించగలదు.
టెస్టు సిరీస్ ఓటమిని ప్రస్తావిస్తే... మన జట్టు రెండు టెస్టుల్లో మూడో ఇన్నింగ్స్ వరకూ పోటీలోనే ఉంది. సరైన ప్రారంభం దక్కక, మిడిలార్డర్‌లో రహనే లేకపోవడంతో నాలుగో ఇన్నింగ్స్‌లో మాత్రమే విఫలమైంది. ఈ రెండు సార్లూ కోహ్లి రాణించకపోవడమూ ప్రభావం చూపింది. జొహన్నెస్‌బర్గ్‌లో లిఫ్ట్‌లో వెళ్తుండగా నాకు ఆజానుబాహులైన రగ్బీ ఆటగాళ్లు తారసపడ్డారు. కోహ్లికి, మిగతా 21 మంది ఆటగాళ్ల మధ్య సామర్థ్యం, దృక్పథం విషయంలో సరిగ్గా ఇదే తీరున తేడా కనిపించింది. టీమిండియా గతంలో దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ గెలుచుకోలేదు. ఈసారి మాత్రం కోహ్లి సేన దానిని చేసి చూపింది. టెస్టు సిరీసూ గెలిచి ఉంటే భారత క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయేది. అందుకే ఇది 80 శాతం ప్రదర్శన కనబర్చిన సిరీస్‌గా మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment