న్యూఢిల్లీ:ప్రస్తుత టీమిండియానే తాను చూసిన మేటి భారత క్రికెట్ జట్టు అంటూ ఇటీవల దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఇప్పటివరకూ ఎన్నో భారత క్రికెట్ జట్లను గావస్కర్ చూసిన ఉన్న క్రమంలో అతని పొగడ్త సరైనదే కావొచ్చని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అయితే విదేశీ గడ్డల్లో కూడా స్వదేశం తరహా విజయాలు సాధించినప్పుడే టీమిండియా మేటి జట్టు అవుతుందని తన అభిప్రాయంగా కోహ్లి స్పష్టం చేశాడు.
'మాకు గావస్కర్ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇది జట్టులో మరింత శక్తిని నింపుతుంది. కానీ ఒక గొప్ప జట్టు అనిపించుకునే స్థాయి ఇంకా చాలా దూరం ఉందనుకుంటున్నా. ఎందుకంటే మా జట్టు ఇంకా యువ క్రికెట్ జట్టే. మేము స్వదేశంలో చాలా బాగా ఆడుతున్నాం. అదే విదేశాల్లో కూడా పునరావృతం చేయాలి. అప్పుడే మేము మేటి జట్టుగా నిలుస్తాం. ఇప్పటివరకూ జట్టుగా ఏమి సాధించామో అందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది'అని కోహ్లి పేర్కొన్నాడు.