విరాట్ అరుదైన ఫీట్
ప్రస్తుతం క్రికెట్ ను శాసిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ముందున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. తన షాట్ సెలక్షన్, నిలకడతో విశేషంగా రాణిస్తున్న కోహ్లి ఇప్పటికే ఖాతాలో అనేక రికార్డులను లిఖించాడు. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్‌లో నాలుగు శతకాలు, ఒకే సీజన్లో అత్యధిక పరుగులు. ఇలా విరాట్ కోహ్లి ఖాతాలో చాలానే రికార్డులే ఉన్నా, తాజాగా మరో ఫీట్ ను అతను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు విరాట్.
సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 54 పరుగులు సాధించిన విరాట్.. ఐపీఎల్లో మొత్తంగా అత్యధిక పరుగులు సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ (4,110) అగ్రస్థానాన్ని దక్కించుకోగా, అతని తరువాత సురేష్ రైనా(4,098) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య ఓవరాల్ ఐపీఎల్ అత్యధిక పరుగుల రికార్డు దోబూచులాడినా చివరకు విరాటే 'టాప్'లో నిలిచాడు. ఐపీఎల్-9లో 973 పరుగులు చేసి అత్యధిక పరుగుల రికార్డును నమోదు చేసిన విరాట్.. ప్రత్యేకంగా ఈ సీజన్లోనే శతకాల వేట కొనసాగించాడు. అంతకుముందు సీజన్లలో ఒక్క శతకం కూడా సాధించని విరాట్.. ఈ సీజన్ లో మాత్రం నాలుగు సెంచరీలు సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐపీఎల్లో విరాట్ అత్యధిక స్కోరు 113.