
విరాట్ అదిరేటి స్టెప్పులు!
న్యూఢిల్లీ: త్వరలో భారత్లో జరుగనున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సల్ కు అంబాసిడర్గా వ్యవరిస్తున్న టీమిండియా టెస్టు క్రికెటర్ విరాట్ కోహ్లి ఆట పాటలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ లీగ్కు సంబంధించి అధికారిక గీతాన్ని ఆలపించిన కోహ్లి.. ఇప్పుడు అదిరేటి స్టెప్పులతో ఆ పాటకు చిందులేశాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో రూపుదిద్దుకున్న ఆ పాటకు సంబంధించిన వీడియోను ఇటీవల విడుదల చేశారు. అందులో విరాట్ తన డ్యాన్స్తో అదరగొట్టాడు. ఫుట్సల్ లీగ్ ప్రమోషన్లో భాగంగా రూపొందించిన ఆ వీడియోలో విరాట్ ఫుల్ జోష్లో స్టెప్పులేసి అలరించాడు.
'ఈ 5-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. ఈ లీగ్కు సంబంధించిన అధికారిక గీతానికి విరాట్ తన గాత్ర దానం చేశాడు. దీంతో పాటు భారత్లో క్రీడాపరమైన లీగ్కు రెహ్మాన్ మ్యూజిక్ చేయడం కూడా ఇదే తొలిసారి. దీంతో తమ తమ రంగాల్లో ప్రత్యేకతను చాటుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన వీడియోకు విశేష ఆదరణ లభిస్తోంది.