చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. శనివారం చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ జట్ల మధ్య ఆరంభపు మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే కోహ్లి హ్యాట్రిక్ రికార్డులపై కన్నేశాడు. అందులో ఒకటి ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డు కాగా, రెండోది అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు. ఇక మూడోది ఐపీఎల్‌లో కోహ్లి ఐదువేల పరుగుల మార్కును అందుకోవడం.
(ఇక్కడ చదవండి: ఇండియన్ ప్రేమించే లీగ్)
ఓవరాల్ ఐపీఎల్ అత్యధిక పరుగుల రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా పేరిట ఉంది. ఇప్పటివరకూ 176 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా 4,985 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. రైనాను అధిగమించడానికి కోహ్లికి 38 పరుగులు అవసరం. ప్రస్తుతం కోహ్లి 4,948 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో డేవిడ్ వార‍్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వార్నర్ 39సార్లు హాఫ్ సెంచరీ మార్కును చేరగా, కోహ్లి 38సార్లు అర్థ శతకాలు సాధించాడు. ఇంకో హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్‌తో సంయుక్తంగా టాప్‌లో నిలుస్తాడు. మరొకవైపు ఐదువేల పరుగుల చేరడానికి కోహ్లికి 52 పరుగులు అవసరం. అయితే రైనాకు మాత్రం ఈ మార్కును చేరడానికి 15 పరుగులు కావాలి. దాంతో ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా ఐదువేల పరుగుల మార్కును అందుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment