హమ్మయ్య... ఈ సీజన్‌లో కోహ్లి జట్టు స్థానం తొలిసారి మారింది. ఆరంభంలో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన బెంగళూరు 10 మ్యాచ్‌లు ఆడాక కూడా అట్టడుగునే నిలిచింది. ఎట్టకేలకు ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్‌ను కిందకు పడేసి ఏడో స్థానంతో కాస్త మెరుగైంది. ప్లే–ఆఫ్ రేసులో నిలిచింది.
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టచ్‌లోకి వచ్చింది. ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్ (44 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్‌లు), రాహుల్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉమేశ్ 3, సైనీ 2 వికెట్లు తీశారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
పార్థివ్ ఫటాఫట్...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టును నడిపించడంలో కెప్టెన్ కోహ్లి (13) విఫలమయ్యాడు. షమీ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి విలోన్ క్యాచ్ మిస్ చేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లి వరుసగా 2 బౌండరీలు బాదాడు. కానీ అతని తదుపరి ఓవర్లో (4వ)నే నిష్క్రమించాడు. డివిలియర్స్ అండతో పార్థివ్ రెచ్చిపోయాడు. రాజ్‌పుత్ ఐదో ఓవర్లో సిక్స్ బాదిన అతను.. షమీ 6వ ఓవర్‌ను 4, 4, 0, 4, 6, 0 చితగ్గొట్టాడు. 18 పరుగులు పిండుకున్నాడు. కానీ పార్థివ్ పటేల్ ఔటైన ఏడో ఓవర్ నుంచి 13వ ఓవర్‌దాకా బెంగళూరుకు కష్టాలెదురయ్యాయి. పార్థివ్ (24 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు మొయిన్ అలీ (4), అ„Š దీప్ నాథ్ (3) వికెట్లను కోల్పోయిన చాలెంజర్స్ ఈ 7 ఓవర్లలో చేసింది 29 పరుగులే! డివిలియర్స్, స్టొయినిస్ మొదట నిదానంగా ఆడి తర్వాత బ్యాట్ ఝళిపించారు. 14వ ఓవర్ నుంచి జట్టు మళ్లీ పరుగుల దారిన పడింది. మురుగన్ అశ్విన్ వేసిన ఆ ఓవర్లో స్టొయినిస్ సిక్స్ కొట్టడంతో 10 పరుగులు జతయ్యాయి. స్కోరు వంద పరుగుల్ని దాటేసింది.
ఆ రెండు ఓవర్లు చుక్కలే..!
బెంగళూరు 18 ఓవర్లు ముగిసేసరికి 154/4 స్కోరు చేసింది. ఇక మిగిలినవి రెండే ఓవర్లు. మహా అయితే 30 పరుగులు చేసినా 180 దాటొచ్చు. కానీ డివిలియర్స్, స్టొయినిస్ చెరో ఓవర్‌ను పంచుకున్నట్లుగా ఆడారు. షమీ, విలోన్ ఓవర్లను చితగ్గొట్టారు. చెప్పాలంటే ఆ బంతులు చుక్కల్ని చూసొచ్చాయి. దీంతో ఆఖరి 12 బంతుల్లోనే రాయల్ చాలెంజర్స్ జట్టు 48 పరుగులు చేసింది. 19వ ఓవర్‌ను షమీ వేశాడు. తొలి రెండు బంతుల్లో సింగిల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడు బంతుల్ని ‘మిస్టర్ 360’ బ్యాట్స్‌మన్ 6, 6, 6గా మలచడంతో 21 పరుగులు లభించాయి. ఒక బంతి అయితే స్టేడియం టాప్‌పైనే స్థిరపడింది. దీంతో మరో బంతి తెస్తేగానీ ఓవర్ పూర్తికాలేదు. విలోన్ ఆఖరి ఓవర్లో తొలి బంతిని డివిలియర్స్ సిక్స్ కొట్టగా... తర్వాత ఆట స్టొయినిస్ ఆడేశాడు. 4, 6, 4, 6 బాదేయడంతో 27 పరుగులొచ్చాయి.
వేగంగా మొదలైన ఛేదన...
లక్ష్యఛేదనను పంజాబ్ వేగంగా మొదలుపెట్టింది. సౌతీ తొలి ఓవర్లో గేల్ 3 ఫోర్లు కొడితే, రాహుల్ తర్వాతి ఓవర్లో 2 బౌండరీలు బాదాడు. 3 ఓవర్లలో పంజాబ్ 36 పరుగులు చేసింది. వేగంగా దూసుకెళ్తున్న జోడీకి ఉమేశ్ కళ్లెం వేశాడు. సిక్స్ కొట్టిన గేల్ (10 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) తర్వాత మరో షాట్‌కు ప్రయత్నించి డివిలియర్స్ చేతికి చిక్కాడు.
రాహుల్ జోరు...
రాహుల్‌కు మయాంక్ జతయ్యాడు. సౌతీ ఐదో ఓవర్లో మయాంక్ వరుస బౌండరీలు కొట్టగా, చహల్ బౌలింగ్‌లో రాహుల్ 6, 4తో అలరించాడు. ఛేదన ఆరంభం నుంచి ఓవర్‌కు 10 పరుగులకు మించే సాధిస్తూ వచ్చిన పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. ఇలా ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను స్టొయినిస్ దెబ్బతీశాడు. తన తొలి బంతికే మయాంక్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మొయిన్ కూడా తన తొలి బంతికే రాహుల్ జోరును ముగించాడు.
పూరన్ మెరుపులు...
9 నుంచి 13వ ఓవర్ వరకు డీలా పడిన పంజాబ్‌ను మళ్లీ పూరన్ పట్టాలెక్కించాడు. సుందర్ వేసిన 14వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. 19 పరుగులు పిండుకున్న పంజాబ్ మళ్లీ జోరందుకుంది. సైనీ 15వ ఓవర్లో ఫోర్ కొట్టిన పూరన్... 16వ ఓవర్లో మరో 2 సిక్సర్లు కొట్టాడు. దీంతో సమీకరణం కూడా వేగంగానే మారిపోయింది. పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో సౌతీ 17వ ఓవర్ వేసి 11 పరుగులిచ్చుకున్నాడు. ఉమేశ్ 18వ ఓవర్లో పూరన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్టొయినిస్ జారవిడిచాడు. 12 బంతుల్లో 30 పరుగులు అవసరమైన దశలో సైనీ తొలి బంతికి మిల్లర్ (24; 2 ఫోర్లు)ను, ఆఖరి బంతికి పూరన్‌ను ఔట్ చేశాడు. ఈ ఓవర్లో మూడు పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో 27 పరుగులు చేయాల్సి ఉండగా ఉమేశ్... అశ్విన్ (6)తో పాటు విలోన్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేయడంతోనే బెంగళూరు విజయం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment