ధర్మశాల: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్నమూడు వన్డేలో టీమిండియా పరుగుల వరద సృష్టిస్తోంది. తొలి వన్డేలో ఓటమి పాలైన అనంతరం రెండో వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటుతున్నారు. యువ క్రికెటర్ విరాట్ కోహ్లి సెంచరీ చేసి భారత్ ను పటిష్ట స్థితిలోకి చేర్చాడు. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా భారత్ ను ఆహ్వానించింది.
దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ శుభారంభం లభించింది. భారత ఓపెనర్లు రహానే (68), శిఖర్ థావన్ (35) పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం విరాట్ కోహ్లి, రైనాల జోడీ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కోహ్లి(100*; 101 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), రైనా (71;58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ లు) విండీస్ కు చుక్కలు చూపించారు. ప్రస్తుతం 46 .3 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 290 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.