'సచిన్ కంటే కోహ్లీయే బెటర్'
కొన్ని కొన్ని కీలక సమయాల్లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ చాలా బెటరని పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌కు ఎప్పుడూ చెవులున్నాయని అంటూ... 1980లలో వివ్ రిచర్డ్స్, బ్రయాన్ లారా, సచిన్ టెండూల్కర్.. వీళ్లంతా ఆడేవారని, కానీ వీళ్లందరి కంటే కూడా తాను చూసినవాళ్లలో కోహ్లీ సంపూర్ణ ఆటగాడని ఇమ్రాన్ చెప్పాడు. అతడు రెండు కాళ్లతోనూ, మైదానంలో అన్నివైపులా ఆడతాడని ప్రశంసలు కురిపించాడు. అతడి టాలెంట్, టెక్నిక్ లాంటి అంశాలను పక్కన పెడితే.. కోహ్లీకి చాలా మంచి టెంపర్‌మెంట్ ఉందని, సచిన్ కంటే అతడి టెంపర్‌మెంట్ బాగుంటుందని అన్నాడు.
ఇటీవల భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కి ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 37 బంతుల్లో 55 పరుగులతో వీరవిహారం చేయడంతో పాక్ ఓడిపోయింది. పాక్ ఓటమి చూస్తుంటే చాలా బాధ అనిపించిందని, అయితే కోహ్లీ మాత్రం చాలా బాగా ఆడాడని ఇమ్రాన్ అన్నాడు. తాను ఒక బౌలర్‌గా బ్యాట్స్‌మన్‌ను చూస్తానని, వాళ్లను ఎలా ఔట్ చేయాలా అనే ఆలోచిస్తానని చెప్పాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కోహ్లీ ఎలా ఆడతాడో చూస్తే.. ఇతరుల కంటే చాలా బాగా ఆడతాడని అన్నాడు. అంతర్జాతీయంగా అతడే అత్యుత్తమమైన ఆటగాడని ప్రశంసించాడు. భారత్‌లో పర్యటించిన సమయంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి, భారత్ - పాక్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని కోరాడు.