14 ఏళ్ల తరువాత విరాట్..
రాజ్కోట్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (40; 95 బంతుల్లో 5 ఫోర్లు)ని దురదృష్టం వెంటాడింది. క్రీజ్లో కుదురుకున్నట్లు కనిపించిన కోహ్లి హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా శనివారం నాల్గో రోజు ఆటలో ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ వేసిన 119 ఓవర్లో మూడో బంతిని కోహ్లి మిడ్ వికెట్ మీదుగా ఆడాడు. అయితే అప్పటికే విరాట్ ఎడమ కాలు బెయిల్స్ను తాకడంతో అది కింద పడిపోయింది. కాగా, ఈ విషయాన్నిగమనించిన కోహ్లి సాధారణంగానే సింగిల్ కోసం క్రీజ్ను సగం దాటేసి వెళ్లిపోయాడు. ఇంగ్లండ్ శిబిరంలో సంతోషం చూసిన తరువాత కానీ విరాట్ కు తాను అవుటయ్యానన్న సంగతి తెలియలేదు.
ఇదిలా ఉండగా, ఈరోజు ఆటలో విరాట్ కు ముందు అజింక్యా రహానే బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాఫర్ అన్సారీ బౌలింగ్ లో బంతిని మీదుగా లాక్కొని రహానే అవుటయ్యాడు. మరొకవైపు టెస్టుల్లో ఒక భారత ఆటగాడు ఇలా హిట్ వికెట్ గా వెనుదిరగడం 14 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 2002లో వీవీఎస్ లక్ష్మణ్ ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో ఇలా హిట్ వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉండగా, ఇలా అవుటైన భారత టెస్టు కెప్టెన్లలో విరాట్ రెండో వాడు. అంతకుముందు అమర్ నాథ్ ఒక్కడే హిట్ వికెట్ గా అవుటైన భారత కెప్టెన్.