మళ్లీ మొదలు పెట్టేశారు...
కోహ్లి, కుంబ్లేలపై విషం కక్కిన ఆస్ట్రేలియా మీడియా
మెల్‌బోర్న్: ఒకవైపు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదాన్ని మరచి ఆటపై దృష్టి పెడదామంటూ క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సిద్ధ పడగా, మరోవైపు ఆసీస్ మీడియా మాత్రం తమ బుద్ధిని పోనిచ్చుకోలేదు. రివ్యూపై రగడ సాగుతున్న సమయంలోనే దానికి పోటీగానా అన్నట్లు ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ఇందులో భారత కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లేలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘డెయిలీ టెలిగ్రాఫ్ ఆస్ట్రేలియా’ పత్రిక రాసిన కథనంలో (ఇది ఆసీస్ ఆటగాళ్లపై భారత్ ఐసీసీకి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోక ముందు ప్రచురితమైంది) నేరుగా ఆసీస్ బోర్డుకు, ఆటగాళ్లకు సంబంధం లేకపోయినా దీని ఆధారంగా వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో మరోసారి క్రికెట్ వాతావరణాన్ని చెడగొట్టేందుకు మాత్రం అవకాశముంది.
ఈ కథనం ప్రకారం... టెస్టు మ్యాచ్‌లో ఒక దశలో కోహ్లి అసహనంతో ఓ ఆస్ట్రేలియా అధికారిపై ఎనర్జీ డ్రింక్ బాటిల్ విసిరేశాడు. ‘ఆసీస్ జట్టు గౌరవాన్ని దెబ్బ తీసే పనిలో కూడా కోహ్లి ముందుండి జట్టును నడిపిస్తున్నాడు సరే. ఆస్ట్రేలియా అధికారి ఒకరిపై ఆరెంజ్ గెటరాడ్ బాటిల్‌ను పడేయడం కూడా అలాంటిదేనా’ అని ఆ కథనంలో రాశారు. పైగా కోహ్లి మైదానం వదిలే సమయంలో ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ బూతులు తిట్టాడని, గొంతు కోస్తా అన్నట్లుగా హ్యాండ్స్‌కోంబ్ వైపు సైగ చేశాడని కూడా ఈ కథనంలో ఉంది. ‘ఇప్పుడు కోహ్లి చెబుతున్న క్రీడాస్ఫూర్తి అనేది ఈ మ్యాచ్‌లో ఎప్పుడో అతని చేతుల్లో నే చచ్చిపోయింది.
ఒక అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇంత ఘోరంగా విలన్ తరహాలో వ్యవహరించడం అర్జున రణతుంగ తర్వాత ఇదే మొదటిసారి’ అని ఈ పత్రిక పేర్కొంది. కోచ్ కుంబ్లేను కూడా టెలిగ్రాఫ్ వదిలి పెట్టలేదు. ఆయన్ని ‘మంకీ గేట్ సూత్రధారి’గా అభివర్ణించిన ఆ పత్రిక... కుంబ్లేనే తెర వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నారని విమర్శించింది. ‘రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి అవుట్‌పై కుంబ్లేకు కోపం వచ్చింది. అంతే... నిబంధనలను పట్టించుకోకుండా అతను మ్యాచ్ అఫీషియల్స్ బాక్స్‌లోకి దూసుకెళ్లి వివరణ కోరడం విచిత్రం’ అని ఈ కథనంలో పత్రిక ఆరోపించింది.