ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాలి
షాంఘై: యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్వా అన్నారు. కోహ్లీ తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనూహ్యంగా గత డిసెంబర్లో ధోని భారత టెస్టు క్రికెట్ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని స్వీకరించిన విరాట్ ఆధ్వర్యంలో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా మరొకటి ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో మాట్లాడిన స్టీవా.. 'కోహ్లీ ఇప్పటికే పరిణతి చెందాడు. అయితే ఈ ప్రపంచ కప్లో కొన్ని విషయాలు అతడిని కాస్తంత డిస్ట్రబ్ చేశాయి. వ్యక్తిగతం కావొచ్చు.. మరేవైనా కావొచ్చు.. అతడు కొంత అసహనంగా, చిరాకుగా, భావోద్వేగాలు ఎక్కువగా బయటపెట్టినట్లు కనిపించాడు. నాయకత్వం విషయంలో ధోని మంచి సమర్థుడు. ఎవరు ఏమన్నా అతడు పెద్దగా పట్టించుకోడు. స్పందించడు. అలాంటి ధోని తప్పకుండా కోహ్లీకి ఒక మంచి రోల్ మోడల్ కాగలడు. అందుకే ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని స్టీవా చెప్పాడు.