
ఆసీస్‌ను ఓడించే సమయం వచ్చింది
సెమీస్‌పై కోహ్లి వ్యాఖ్య
సిడ్నీ: ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా భారత జట్టు ప్రదర్శన అజేయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇదే సరైన సమయమని, అలాగైతేనే ఈ జోరుకు సముచిత న్యాయం చేసినట్టవుతుందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ‘ఆసీస్‌ను ఓడించేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఆసీస్‌లో ఇప్పటిదాకా మేం ఎలా ఆడామో తెలిపేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఫలితం ఎవరి చేతుల్లోనూ లేదు. నిజానికి ఈ మెగా టోర్నీలో మాకు ఎక్కువగా ఖాళీ సమయం లేకున్నా సమష్టిగా మా లోపాలను సవరించుకున్నాం. బ్యాట్స్‌మెన్ తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటే బౌలర్లు మిగతా పని కానిస్తున్నారు’ అని కోహ్లి అన్నాడు.
దీటుగా ఎదుర్కొంటాం: ఫించ్
భారత పేస్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటిదాకా భారత పేస్‌త్రయం షమీ, మోహిత్, ఉమేశ్ కలిసి 42 వికెట్లు తీశారు. ‘భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి సెమీస్ వరకు టోర్నీలో షమీ అత్యధిక వికెట్ల రేసులో ఉన్నాడు.
మోహిత్, యాదవ్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇక మేం వీరిని మెరుగైన రీతిలోనే ఎదుర్కొంటామని భావిస్తున్నాం. అశ్విన్, జడేజా రూపంలోనూ వారికి మంచి స్పిన్నర్లు ఉన్నారు. ఇక సిడ్నీ పిచ్‌పై ఇప్పుడే ఓ అంచనాకి రాకూడదు. ఇంకా మ్యాచ్‌కు సమయముంది. అప్పటివరకు పిచ్‌లో మార్పు రావచ్చు’ అని ఫించ్ అన్నాడు.