'కోహ్లి.. నిన్ను నీవు అద్దంలో చూసుకో'
బెంగళూరు:ఐపీఎల్-10 సీజన్ లో పేలవమైన ఆట తీరును కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. గత కొన్ని మ్యాచ్ ల్లో విరాట్ ఆట తీరు చూస్తే చాలా దారుణంగా ఉందంటూ మండిపడ్డ గవాస్కర్.. ఒకసారి అతని ఆటను అద్దంలో చూసుకుంటే మంచిదంటూ హితబోధ చేశాడు.
' బెంగళూరు ఆట కంటే ముందు విరాట్ ఆటను నిశితంగా పరిశీలించుకుంటే మంచిది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఒక చెత్త షాట్ కు అవుటయ్యాడు. అది కచ్చితంగా మంచి షాట్ కాదు. ఈడెన్ గార్డెన్ లో కేకేఆర్ తో ఆడిన షాట్ చూడండి. అది కూడా చెత్త షాట్. కచ్చితమైన క్రికెటింగ్ షాట్లు ఆడటంలో విరాట్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒకసారి విరాట్ ఆటను ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది' అని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. ఒక కెప్టెన్ గా విరాట్ పై ఎంతో బాధ్యత ఉన్నప్పుడు నిర్లక్ష్య పూరిత షాట్లు సమంజసం కాదని చురకలంటించాడు. అతను ఫామ్ లేకపోయినప్పటికీ, కనీసం క్రీజ్ లో ఉండి కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను ఆడే ప్రయత్నమే విరాట్ చేయలేదని గవాస్కర్ దుయ్యబట్టాడు.ఒక మంచి ఆటగాడు చెత్త షాట్లకు అవుతుంటే ఒకసారి ఆటను పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.