టీమిండియాను డీఆర్‌ఎస్‌ కొంపముంచిందా? | Virat Kohli Slams Inconsistent DRS After Australia Pull Off Stunning Upset In Mohali | Sakshi
Sakshi News home page

టీమిండియాను డీఆర్‌ఎస్‌ కొంపముంచిందా?

Published Mon, Mar 11 2019 12:47 PM | Last Updated on Mon, Mar 11 2019 2:43 PM

Virat Kohli Slams Inconsistent DRS After Australia Pull Off Stunning Upset In Mohali - Sakshi

మొహాలి: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డేలో సైతం అంపైర్‌ నిర్ణయ పునః సమీక్ష పద్దతి(డీఆర్‌ఎస్‌)లో వైఫల్యం కొట్టిచ్చినట్లు కనబడింది. గత మ్యాచ్‌లో  బాల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీలో లోపం కనిపించగా, నాల్గో వన్డేలో ఆస్టన్‌ టర్నర్‌ ‘ఔట్‌’కు సంబంధించి డీఆర్‌ఎస్‌ చర‍్చనీయాంశమైంది.  44 ఓవర్‌లో చహల్‌ బౌలింగ్‌లో టర్నర్‌ కీపర్‌ రిషభ్‌ క్యాచ్‌కు చిక్కాడు. అయితే దీనిపై టీమిండియా అప్పీల్ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. అది గట్టిగా ఔట్‌ అని నమ్మిన రిషభ్‌ పంత్‌.. రివ్యూకు వెళదామని కోహ్లికి సూచించాడు. దాంతో టీమిండియా డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. పలుమార్లు రిప్లేలో చూసిన థర్డ్‌ అంపైర్‌ తనకు కూడా స్పష్టత లేదనే సంకేతాలిచ్చాడు. అది ఔటా.. కాదా అనే నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేశాడు. ఈ క్రమంలోనే తాను తొలుత ప‍్రకటించిన నిర్ణయానికే ఫీల్డ్‌ అంపైర్‌ కట్టుబడటంతో భారత్‌కు నిరాశే ఎదురైంది. దీనిపై బహిరంగంగానే కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. స్నికో మీటర్‌లో బంతి ఎడ్జ్‌ తీసుకున్నట్లు కనబడుతున్నా ఇంకా స్పష్టత లేకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్‌ తర్వాత కూడా డీఆర్‌ఎస్‌పై పెదవి విరిచాడు కోహ్లి. డీఆర్‌ఎస్‌ను మళ్లీ సందేహించాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
(ఇక్కడ చదవండి: డీఆర్‌ఎస్‌పై మరో వివాదం)

భారత్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఆటగాడు ఆస్టన్‌ టర్నర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు సాధించాడు. దాంతో ఆసీస్‌ ఇంకా 13 బంతులుండగానే విజయాన్ని అందుకుంది. అయితే ఆస్టన్‌ టర్నర్‌ ‘క్యాచ్‌ ఔట్‌’పై  భారత్‌ రివ్యూకు వెళ్లేసరికి అతని స్కోరు 41. అక్కడే టర్నర్‌ ఔటై ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని సమీక్షించే క్రమంలో రిప్లేలో చాలా స్పష్టంగా స్పైక్‌ కనిపించింది. స్నికో మీటర్‌లో బంతి ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ చేతుల్లో పడింది. కాగా, దీన్నే పూర్తిస్థాయి ప్రామాణికంగా తీసుకోని థర్డ్‌ అంపైర్‌.. ఔట్‌పై నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలేశాడు. ఇక్కడ ఫీల్డ్‌ అంపైర్‌ తాను తొలుత ప్రకటించిన నిర్ణయానికి కట్టుబడటంతో టీమిండియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇక అంపైర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసే అవకాశం లేకపోవడంతో కోహ్లి అసంతృప్తితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దాదాపు నెల రోజుల వ్యవధిలోనే  డీఆర్‌ఎస్‌ పని తీరుపై సందేహాలు రావడం ఇది మూడోసారి. గత నెల 8వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో డీఆర్‌ఎస్‌పై అనేక అనుమానాలు తలెత్తాయి.  కివీస్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఎల్బీగా మైదానం వీడిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. అక‍్కడ హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు చూపించగా, స్నికో మీటర్‌లో దీనికి విరుద్ధంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్‌ కనిపించలేదు. దాంతో బాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే తాజా సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో బాల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీ  అనేక ప‍్రశ్నలకు తావిచ్చింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. దాంతో 93 పరుగులు చేసిన ఫించ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.
(ఇక్కడ చదవండి: టర్నర్‌ విన్నర్‌)

థర్డ్‌ అంపైర్‌ పలు కోణాల్లో పరీక్షించి ఫించ్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఆ బంతి పిచ్‌ అయ్యే క్రమంలో మిడిల్‌ స్టంప్‌ నుంచి మిడిల్‌ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీలో మాత్రం అది లెగ్‌ స్టంప్‌లో పడి మిడిల్‌ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్‌ఎస్‌లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. గతంలో ఒకానొక సందర్భంలో డీఆర్‌ఎస్ సరిగా లేదనే వాదనను భారత్‌ బలంగా వినిపించింది. అయితే ఈ టెక్నాలజీని పలుమార్లు పరీక్షించిన తర్వాత అందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. ఇప్పుడు డీఆర్‌ఎస్‌లో వరుస వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనబడుతుండటం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. డీఆర్‌ఎస్‌తో  కచ్చితత్వం వస్తుందనే నమ్మకంతోనే దీన్ని ప్రవేశపెడితే ఈ టెక్నాలజీ మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా వరల్డ్‌కప్‌ సమీపిస్తున్న తరుణంలో డీఆర్‌ఎస్‌లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడటం ఐసీసీకి మరింత తలనొప్పిని తెచ్చే పెట్టే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement