
విరాట్ కోహ్లి
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం క్రికెట్లోనే కాదు ఇదివరకే సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల పరంగా దూసుకెళ్లాడు. ఇప్పుడు ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీల జాబితాలోనూ ‘టాప్’ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఈ ‘రన్ మెషిన్’ తాజాగా భారత టాప్–100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు. మొత్తం రూ. 252.72 కోట్ల ఆర్జనతో అతనికి మొదటి స్థానం దక్కింది. అయితే బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఫోర్బ్స్ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయంతోనే గణించరు. ఆ లెక్కన చూస్తే అక్షయ్ ‘టాప్’లేపేవాడు. కానీ ఫోర్బ్స్ లెక్కకు ఇతర కోణాలు ప్రాతిపదిక అవుతాయి.
ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య (ఫాలోవర్స్)లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ అంశాలను లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్ మేగజైన్ తాజా సంపన్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లికి అగ్రతాంబూలమిచి్చంది. టాప్–100లో క్రీడాకారుల సంఖ్య పెరిగింది. 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెటర్లు కాకుండా బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా, సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), మేరీకోమ్ (బాక్సింగ్), బజరంగ్ (రెజ్లింగ్), అనిర్బన్ (గోల్ఫ్), బోపన్న (టెన్నిస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment