ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి తలో స్థానం మెరుగుపర్చుకున్నారు. ఈ ముగ్గురు తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు, ఆరు, ఏడు స్థానాలకు ఎగబాకారు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ క్రికెట్ ఆడనప్పటికీ ఈ ముగ్గురి ర్యాంకింగ్స్ మెరుగుపడటం గమనార్హం.
వీరితో పాటు టాప్-10లో ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ కూడా తలో స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలకు చేరారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ టాప్-4 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.
లంక ఆటగాళ్ల హవా
ఈ వారం ర్యాంకింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో సత్తా చాటిన ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి.. అదే టెస్ట్‌లో రాణించిన కమిందు మెండిస్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారీ లబ్ది పొందిన లంక ఆటగాళ్లలో పథుమ్ నిసాంక ముందువరుసగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకుని 39వ స్థానానికి ఎగబాకాడు. ఇది మినహా టాప్-100 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ..!
టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ లంక ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. మిలన్ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు. ఈ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జోష్ హాజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా టాప్-3లో కొనసాగుతున్నారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
జడ్డూ@1.. అశ్విన్@2
టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ 1, 2, 6 స్థానాలను నిలబెట్టుకున్నారు. లంక ఆటగాడు మిలన్ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment