
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ముంబై ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు శుభవార్త తెలిసింది.
గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. బుమ్రా ఐపీఎల్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి సింహం గర్జించేందుకు సిద్దంగా ఉందని క్యాప్షన్ జోడించింది.
ఈ వీడియోలో బుమ్రా భార్య సంజనా తమ కొడుకు అంగద్‌కు తండ్రి ఐపీఎల్ ప్రస్తానాన్ని వివరిస్తుంది. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నాటి నుంచి ముంబై సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు తీశాడు.
బుమ్రా ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో జరిగిన చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు (వెన్ను సమస్య). ఫలితంగా అతను భారత్ ఛాంపియన్‌గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమ్యాడు. గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బుమ్రా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేశాడు.
కొన్ని రోజులు అక్కడ రీహ్యాబ్‌లో ఉండిన బుమ్రా.. తాజాగా ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరాడు. బుమ్రా జట్టులో చేరినా ఏప్రిల్ 7న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోలేమని చెబుతున్న బీసీసీఐ మరికొన్ని రోజులు అతన్ని అబ్జర్వేషన్‌లోనే ఉంచాలని భావిస్తుంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సీజన్‌లో బుమ్రా లేని లోటు ముంబై ఇండియన్స్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. యువ బౌలర్లు విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ సత్తా చాటినా బుమ్రా స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ కూడా తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బంతితో సత్తా చాటినా (4-0-36-5) ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై వేగంగా పరుగులు సాధించలేక 12 పరుగుల తేడాతో ఓడింది. హర్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ముంబైని గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వకుండా హార్దిక్ ఓవరాక్షన్ చేశాడు. స్ట్రయిక్ అట్టిపెట్టుకుని అతనైనా పరుగులు రాబట్టాడా అంటే అదీ లేదు.
వరుసగా రెండు డాట్ బాల్స్ చేసి ముంబై ఓటమిని ఖరారు చేశాడు. బుమ్రా రాకతోనైనా ముంబై ఫేట్ మారుతుందేమో చూడాలి. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఆడలేదు. గాయం కారణంగా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.