సలహాలకే పరిమితమా!
♦ బాధ్యత తీసుకోని సీఏసీ
♦ బాధ్యత తీసుకోని సీఏసీకోచ్, కెప్టెన్‌ల వివాదంలో ముగ్గురు దిగ్గజాల నిస్సహాయత
సచిన్, గంగూలీ, లక్ష్మణ్... భారత క్రికెట్‌కు ఆటగాళ్లుగా ఎనలేని సేవలందించారు. వారి అనుభవాన్ని, ఆలోచనలను మరో రీతిలో వాడుకోవాలనే ఆలోచనతో బీసీసీఐ ప్రత్యేకంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని ఏర్పాటు చేసింది. దాంతో పాటు కోచ్‌ను ఎంపిక చేసే పనిని కూడా వారి చేతుల్లోనే పెట్టింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన సలహాలు ఏమిటి, అవి ఎంత వరకు భారత క్రికెట్‌కు మేలు చేశాయో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ భారత కోచ్ ఎంపిక విషయంలో, కోచ్, కెప్టెన్ వివాదాన్ని పరిష్కరించే విషయంలో కూడా కమిటీ చురుగ్గా వ్యవహరించలేకపోయింది. ఈ దిగ్గజాలు మరింత బాధ్యతను తీసుకొని ఉంటే గొడవ ముదరకుండా ముగిసిపోయేదేమో!
సాక్షి క్రీడా విభాగం
గత ఏడాది భారత కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసే విషయంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) తమ పరిధికంటే మించి ఉత్సాహంగా పని చేసింది. ఎలాగైనా తమ మాజీ సహచరుడు కుంబ్లేను ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తమ అధికారాన్ని గట్టిగా ఉపయోగించారు. ‘కనీసం జాతీయ జట్టుకు లేదా ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉండాలి’ అనేది కోచ్ పదవికి పోటీ పడేందుకు ఉంచిన నిబంధనల్లో ప్రధానమైంది. కానీ ఈ ముగ్గురు దానిని తోసిరాజన్నారు. నిబంధనల ప్రకారం కుంబ్లేకు అర్హత లేకపోయినా అతడికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రవిశాస్త్రితో గొడవ పెట్టుకునేందుకు కూడా గంగూలీ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కమిటీ వ్యవహరించిన తీరు ఇది. అంటే నిబంధనలను ఉల్లంఘించవచ్చని తామే చేసి చూపించారు.
పరిష్కరించే ప్రయత్నమేది?
కోహ్లి, కుంబ్లే మధ్య చాలా రోజులుగా విభేదాలు సాగుతున్నాయనే విషయం చాంపియన్స్ ట్రోఫీకి ముందే మీడియాలో వచ్చింది. కానీ ఇలాంటి విషయాలు ఆ ముగ్గురికి అప్పటి వరకు తెలియదనుకోవాలా! తెలిసినా ఎందుకు మౌనం వహించారు. తాము ఏరికోరి ఎంపిక చేసిన కోచ్‌కు, కెప్టెన్‌కు పడటం లేదంటే కలగజేసుకొని సరిదిద్దే ప్రయత్నం కూడా వారు చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి మధ్య దాదాపు రెండు నెలల విరామం ఉంది. ఆ సమయంలో దీనికి ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం కూడా జరగలేదు. అది మా పని కాదని వారు చెప్పడానికి వీలులేదు. భారత క్రికెట్‌లో దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరినుంచి బీసీసీఐ కేవలం సలహాలకంటే ఎక్కువే ఆశించడం సహజం. తాము కోచ్‌ను ఎంపిక చేయడంతోనే పని ముగిసిపోయిందని ఈ ముగ్గురు భావించారా? నిజానికి సచిన్ స్థాయి వ్యక్తి పూనుకుంటే ఆరంభంలో కచ్చితంగా ఎంతో కొంత మెరుగైన ఫలితం వచ్చేది. అతని మాటను కుంబ్లే గౌరవించకపోయేవాడా? లేక గురుభావంతోనైనా కోహ్లి కాదనేవాడా?
ఇప్పుడేం చేస్తారు?
పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఈ ముగ్గురు కుంబ్లేనే కోచ్‌గా కొనసాగించమంటూ సిఫారసు చేశారు. కోహ్లి అసలు దానిని లెక్క చేయకపోవడం ఈ కమిటీ వైఫల్యం కిందనే లెక్క. కుంబ్లే హుందాగా తప్పుకున్నాడు కాబట్టి వివాదం సద్దుమణిగింది. కమిటీ చెప్పింది కాబట్టి తాను కొనసాగుతానంటే పరిస్థితి ఎలా ఉండేదో! మరో సారి కొత్త కోచ్ ఎంపిక కూడా ఈ త్రిసభ్య కమిటీ చేతికే వచ్చింది. మేం కోచ్ ఎంపికలో జోక్యం చేసుకోమని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇప్పటికే స్పష్టం చేసింది కాబట్టి పూర్తి బాధ్యత మళ్లీ కమిటీదే. తాము ఎంపిక చేసిన వ్యక్తి ఏడాది కాలానికే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి కమిటీపై బాధ్యత మరింత పెరిగింది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. సొంత ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా ఈసారి తమ క్రికెట్ పరిజ్ఞానం, అనుభవం, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోచ్‌ను ఎంపిక చేయడం అవసరం. అదే విధంగా తాజా పరిణామాల కారణంగా కోహ్లితో కూడా ముందుగా మాట్లాడతారా అనేది ఆసక్తికరం. నిజంగానే అదే జరిగి కోహ్లి చెప్పిన పేరుకే ఆమోద ముద్ర వేస్తే మాత్రం ఏ మాత్రం బాధ్యతలు పట్టని, కోరలు లేని ఈ కమిటీ ఉండటం కూడా అనవసరం!
ఆరు నెలలుగా మాటల్లేవ్!
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం... ఏడాది పదవీ కాలంలో గత ఆరు నెలల నుంచి కెప్టెన్, కోచ్ అసలు మాట్లాడుకోవడం లేదట. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన నాటినుంచి వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నట్లు సమాచారం. మరి కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా అలాగే సాగిపోయిందంటే బోర్డు పెద్దలు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. ‘వీరిద్దరు ఆరు నెలల్లో ఒకే ఒక్కసారి ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు కూడా వారిద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇక మైత్రి కొనసాగదని వారిద్దరికి అర్థమైపోయింది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. దాంతో చిర్రెత్తిన క్రికెటర్లు కుంబ్లేపై మరింత వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇదే విషయాన్ని వారు కోహ్లికి కూడా ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అంతకు ముందు కూడా కోచ్ గురించి ఆటగాళ్ల లెక్కలేనితనం బయటపడింది. చాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల తప్పొప్పులను గుర్తించేందుకు కుంబ్లే వీడియో అనలిస్ట్‌తో సుదీర్ఘంగా కూర్చున్నారు. ఒక్కొక్కరి వీడియో క్లిప్‌లను తీసుకొని లోపాలు ఎలా సరిదిద్దుకోవాలో కూడా వివరిస్తూ కుంబ్లే నోట్స్ రాశారు. అదే రోజు రాత్రి వీడియో, నోట్స్‌ను ఒక్కో ఆటగాడికి పంపించారు. కానీ రెండు రోజుల తర్వాత చూస్తే జట్టులో ఏ ఒక్కరు కుంబ్లే వీడియోను చూడలేదు. అతనిచ్చిన నోట్స్‌ను కూడా కనీసం చదవలేదు! కుంబ్లే తాను తప్పుకోవడం అవసరమనే నిర్ణయం తీసుకునేందుకు ఇది సరిపోయింది.