వారివల్లే ఓడాం: సెహ్వాగ్
పుణె: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లపై ఆజట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్, ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం విదేశీ ఆటగాళ్ల బాధ్యారాహిత్యం వల్లే ప్లేఆఫ్ చేరలేకపోయిందని విమర్శించాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్ ఆటతీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. ప్రధాన ఆటగాళ్లలో ఏఒక్కరు సరిగ్గా ఆడలేదు. నలుగురు కీలక ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 12-15 ఓవర్లు వరకు క్రీజులో నిలబడాలి. కానీ ఎవరూ ఆబాధ్యత తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి పిచ్‌లపైనైనా ఆడగల సత్తా ఉండాలి.
పిచ్ మందకొడిగా ఉందని చెప్పడం సమంజసం కాదు. జట్టు కోసం కనీసం 20 ఓవర్లైనా నిలవలేరా? జట్టులో ప్రధాన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన మాక్స్‌వెల్, షాన్ మార్ష్, మోర్గాన్‌లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. వారి ఆటతీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. పరిస్థితులకు అనుగుణంగా 10-12 ఓవర్లు ఆడి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత మార్ష్‌ది. కెప్టెన్‌గా మాక్స్‌వెల్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో రాణించిన ఆమ్లా జట్టుకు దూరం కావడంతో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.