వరుస విజయాలు.. కింగ్స్ వెనుక ఉన్నదెవరు?
గత ఏడాది అత్యంత చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు.. ఈసారి సరికొత్త ఉత్సాహంతో, వరుస విజయాలతో దూసుకుపోతున్నది. తాజా టోర్నమెంటులో వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదుంది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌పై ఆరు వికెట్లతో విజయం సాధించిన పంజాబ్ తాజాగా పటిష్టమైన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎనిమిది వికెట్లతో సునాయసంగా మట్టికరిపించింది. మరీ, పంజాబ్ జట్టు వరుస విజయాలు వెనుక ఉన్నదెవరంటే.. ఈ క్రెడిట్ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌దేనంటున్నాడు ఆ జట్టు బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా.
‘ఒక శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అయిన సెహ్వాగ్ ఆటగాళ్ల విషయంలో ఎంతో అద్భుతంగా పనిచేశారు’ అని ఆమ్లా చెప్పాడు. ఒకప్పుడు వీరోచిత ఓపెనర్ అయిన సెహ్వాగ్ కింగ్స్ ఆటగాళ్ల విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. తమ ఆటశైలిని మార్చాలని ఆయన ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని పేర్కొన్నాడు.
’భారత్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్‌లో వీరూ ఒకరన్న విషయం మా అందరికీ తెలుసు. ఒక ప్రత్యేకశైలికి అలవాటుపడాలని చెప్పే వ్యక్తి ఆయన కాదు. ప్రతి ఆటగాడు తమ సామర్థ్యంమేరకు ఉత్తమంగా రాణించాలని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు. జట్టుకు ఉపయోగపడేరీతిలో ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించేవారు’ అని ఆమ్లా తెలిపారు. ఇక జట్టు కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని, సీనియర్ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలు పట్టించుకుంటారని ఆమ్లా కొనియాడాడు.