ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన విధ్వంసకర బ్యాటింగ్ శైలి తరహాలో.. ట్విట్టర్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏ సందర్భం వచ్చినా వదలకుండా ట్వీట్లు బాదేస్తుంటాడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా పుణె టెస్టులో టీమిండియా ఓటమిపై వ్యంగాస్త్రాలు విసిరిన వీరూ.. తాజాగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్ కౌర్ పోస్టింగ్‌కు రిప్లే ఇచ్చాడు.
ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్‌మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్‌మెహర్.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. అంతకుముందు తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి వచ్చింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు.
వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. వీరిలో సెలెబ్రిటీలు, రచయితలు ఉన్నారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికి వీరూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. నెటిజెన్ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేపింది.